వివరాలు చెబుతున్న ఎస్పీ సత్య ఏసుబాబు, పక్కన కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, సీఐ నరసింహారావు, వెనుక నిందితుడు శివకోటయ్య, సొత్తు
ఒంగోలు క్రైం: జిల్లా వ్యాప్తంగా మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను కందుకూరు పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. మొత్తం మీద పది ఇళ్లలో చోరీలు చేసి దర్జాగా తిరుగుతున్న వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని ఐటీ కోర్ సెంటర్‌లో జఎస్పీ బి.సత్య ఏసుబాబు సోమవారం సాయంత్రం విలేకరులకు వివరాలను వెల్లడించారు. కందుకూరు పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న అక్కల శివ కోటయ్య గత మూడేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తున్నాడు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఈ నేపథ్యంలో స్థానిక మహదేవపురం రోడ్డులో అరెస్ట్ చేసిన కందుకూరు పోలీసులు అతని వద్ద నుంచి 43 సవర్ల బంగారు ఆభరణాలు, మూడు కేజీల వెండి, ఒక బొలేరో వాహనం, రూ. 80 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
వీటి మొత్తం విలువ దాదాపు రూ. 15.63 లక్షలు ఉంటుంది. కందుకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి వెనుక వైపు నివాసం ఉంటున్న అక్కల శివ కోటయ్య స్వతహాగా కార్పెంటర్. అయితే మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు కందుకూరు వడ్డిపాలెంలో ఉంటుండగా రెండో భార్య చీమకుర్తిలో ఉంటోంది. రెండు కాపురాలను చేయాల్సి రావడం.. జల్సాలకు అలవాటు పడిటం వల్ల దొంగగా మారాడు.
2015లో కందుకూరు నందావారి వీధిలో, 2017లో కందుకూరు నాంచారమ్మ కాలనీలో, చీమకుర్తి విజయ దుర్గా వైన్ షాపులో, కందుకూరు కోటిరెడ్డి నగర్‌లో, కందుకూరు పామూరు రోడ్డులో, కందుకూరు రూరల్ వెంకటాద్రిపాలెంలో, కందుకూరు వడ్డిపాలెంలో, చీమకుర్తిలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో, కందుకూరులోని తేలుప్రోలు వారి వీధిలో, 2018లో కందుకూరు ఆర్డీఓ కార్యాలయం వెనుక వైపు దొంగతనాలు చేశాడు.
పోలీసులకు అభినందన మూడేళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న కందుకూరు పోలీసులను ఎస్పీ సత్య ఏసుబాబు అభినందించారు. కందుకూరు సీఐ నరిసింహారావుతో పాటు ఎస్సైలను, సిబ్బందికి రివార్డులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment