
వామపక్ష సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో రాజకీయ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్త హత్యకు గురయ్యాడు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
ఆరెస్సెస్ కార్యకర్త అయిన పీ ఆనంద్‌పై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దాడి జరిగింది. మోటారుబైక్‌పై వెళుతున్న అతన్ని గుర్తుతెలియని దుండుగులు కత్తులతో దాడిచేసి పొడిచారు. ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్‌లోని నెన్మిని వద్ద ఈ ఘటన జరిగింది. దుండగులు పలుసార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా..అక్కడ ప్రాణాలు విడిచాడు. మూడేళ్ల కిందటి సీపీఎం కార్యకర్త కాశీం హత్యకేసులో ఆనంద్ నిందితుడు. బెయిల్‌పై బయట ఉన్న అతడిపై సీపీఎం కార్యకర్తలే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు.
కేరళలో ఆరెస్సెస్, సీపీఎం మధ్య నిత్యం హింస చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ హత్యలకు నెలవుగా మారిన కేరళలో ఇటీవల బీజేపీ అధికార సీపీఎంకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జనరక్షణ యాత్రనుచేపట్టింది. ఈ యాత్రలో బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురికావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.