
యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం): అన్నం పెట్టలేదనే కోపంతో తల్లినే కడతేర్చాడో కర్కోటకుడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్త్యాల గ్రామానికి చెందిన మేరుగు రమ (45) భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులతో కలసి ఉంటూ కూలీపని చేస్తోంది. పెద్ద కొడుకు ప్రశాంత్ చిన్నాచితక పనులు చేస్తూ ఉంటాడు.
శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రశాంత్ తల్లిని అన్నం పెట్టమని అడిగాడు. ‘నువ్వేం పని లేకుండా తిరుగుతున్నావ్.. అసలు అన్నం వండనేలేదు’అని తల్లి రమ సమాధానం ఇచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రశాంత్ రమ తలపై రోకలిబండతో బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.