చిత్తు కాగితమే ఆధారం.. | Scrap paper is the clue | Sakshi
Sakshi News home page

చిత్తు కాగితమే ఆధారం..

Published Fri, Mar 16 2018 12:34 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Scrap paper is the clue - Sakshi

వివరాలు వెల్లడిస్తోన్న కొత్వాల్‌ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌: మహారాష్ట్రకు చెందిన 10 మంది ముఠా కట్టారు... పక్కాగా ప్లాన్‌ చేసి రెక్కీ నిర్వహించారు... నగరంలో పంజా విసిరారు... ఏ సాక్ష్యం మిగలకుండా జాగ్రత్తపడ్డారు... అయినా ఘటనాస్థలిలో పోలీసులకు లభించిన ఓ ఆంగ్ల పత్రిక కీలకాధారంగా మారి ముఠా గుట్టు రట్టు చేసింది. పేట్లబురుజులోని బంగారు నగల తయారీ కర్మాగారంలో ఈ నెల 6న చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసు నేపథ్యమిది. మహారాష్ట్రకు చెందిన ఈ గ్యాంగ్‌ సూత్రధారి అమ్జను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ గురువారం వెల్లడించారు.

పరారీలో ఉన్న ముఠా సభ్యులు చిక్కితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో 3.5 కేజీల బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలు చోరీకి గురికాగా, ప్రస్తుతం రూ.6 లక్షల విలువైన సొత్తు చేసుకున్నట్లు తెలిపారు.
 
ముంబై కార్యాలయం సమీప వాసే... 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిథాయిదాస్‌ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ముంబైలో ప్రధాన కార్యాలయంతో పాటు ఓ కార్ఖానా ఉండగా, పాతబస్తీలోని పేట్లబురుజు ప్రాంతంలోని షేర్‌ అలీ తబేలాలోని ముజీబ్‌ అనే వ్యక్తి ఇంట్లో మరో కార్ఖానా నడుస్తోంది. «థానేలోని అతని కార్యాలయానికి సమీపంలో నివసిస్తున్న పాత నేరగాడు అమ్జద్‌ ఖాజా అమీన్‌ షేక్‌ అలియాస్‌ అమ్జా కన్ను నిథాయి వ్యాపార లావాదేవీలపై పడింది.

అంతరాష్ట్ర ముఠాను నిర్వహించే ఇతడిపై షోలాపూర్, థానే, ముంబైల్లోని పోలీసుస్టేషన్లలో స్నాచింగ్, దోపిడీ, బందిపోటు దొంగతనాలకు సంబంధించి 40 కేసులు ఉన్నాయి. షేర్‌ అలీ తబేలాలోని నిథాయిదాస్‌కు కర్మాగారాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్న ఇతను ముంబైతో పాటు షోలాపూర్‌కు చెందిన తొమ్మి ది మందితో ముఠా ఏర్పాటు చేశాడు. ఇదే కర్మా గారం టార్గెట్‌గా మారడం వెనుక ఇంటిదొంగల పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. 

పక్కా ప్రొఫెషనల్‌గా.. 
ఆరితేరిన బందిపోటు ముఠా కావడంతో వీరు పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. ముఠాకు చెందిన ఓ వ్యక్తిని నాయకుడు ముందుగా నగరానికి పంపించి రెక్కీలు చేయించాడు. కొన్ని రోజుల ముందు ముఠా సభ్యులంతా వేర్వేరుగా వచ్చి హైదరాబాద్‌లో కలిశారు. అప్పుడే వీరికి పేట్లబురుజుల్లో ఎంచుకున్న తమ ‘మీటింగ్‌ పాయింట్‌’ నాయకుడు చూపించాడు. ఆపై ఎవరికి వారుగా వెళ్లిపోయారు. ఈ నెల 5న ముంబై నుంచి బయలుదేరిన ముఠా షోలాపూర్‌ చేరుకుంది. అక్కడ నుంచి ఎవరికి వారుగా 6న హైదరాబాద్‌ చేరుకున్నారు.

ముఠా నాయకుడితో పాటు సభ్యులు సైతం తమ వెంట కత్తులను మాత్రమే తీసుకువచ్చారు. బేగంపేట, సికింద్రాబాద్, నాంపల్లిల్లో వేర్వేరుగా దిగిన వీరు సులఖ్‌ కాంప్లెక్స్‌ల్లో కాలకృత్యాలు తీర్చుకుని ఎవరికివారు పాతబస్తీలోని తమ మీటింగ్‌ పాయింట్‌కు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా కలవకుండా వేర్వేరుగానే ఉంటూ, కనుసైగలతో సంభాషించుకుని కార్ఖానాపై దాడి చేశారు.  

భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ తర్వాత... 
దీంతో ముంబై వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడి పోలీసులను కలిసి ఆరా తీయగా, అమ్జతో సహా మరికొందరు పాత నేరగాళ్ల వివరాలు లభించాయి. వీటి ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు అమ్జను పట్టుకుని సిటీకి తీసుకువచ్చాయి. ఇతడి నుంచి రూ.6 లక్షలు విలువైన సొత్తు రికవరీ చేయగా... మిగిలింది ముఠా సభ్యులు ముంబై, గుజరాత్‌లో విక్రయించినట్లు గుర్తించారు. వారు అరెస్టైన తర్వాత ఆ సొత్తు రికవరీ చేయాలని భావిస్తున్నారు. ఈ ముఠాలో ఎవరైనా పోలీసులకు చిక్కిన వెంటనే మిగిలిన వారు రివకరీకి ఆస్కారం ఇవ్వరు.

మిస్సింగ్‌ కేసులు పెట్టడం, కోర్టుల్లో పిటీషన్లు  వేయడం, మానవహక్కుల సంఘాలను ఆశ్రయించడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరు అనేక చోట్ల నేరాలు చేసి చిక్కినా ఎక్కడా పూర్తి స్థాయి రికవరీ సాధ్యం కాలేదు. ఈ గ్యాంగ్‌లో మిగిలిన సభ్యులను అరెస్టు చేయడానికి, సొత్తు రికవరీ కోసం రెండు టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక బృందాలను కొనసాగిస్తున్నారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడంలో టాస్క్‌ఫోర్స్, చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.మోహన్‌కుమార్, కె.చంద్రశేఖర్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు కొత్వాల్‌ తెలిపారు.

కత్తికి చుట్టిన పేపర్‌ ఆధారంగా..
పక్కాగా వ్యవహరించిన ఈ గ్యాంగ్‌ తమకు తెలియకుండానే కీలక సాక్ష్యాన్ని పోలీసులకు అందించింది. 5న ముంబై నుంచి బయలుదేరిన ముఠా సభ్యుడు తన కత్తిని అక్కడి ఓ ఆంగ్ల దినపత్రికలో చుట్టుకుని, బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చాడు. కార్ఖానాలోకి ప్రవేశించిన తర్వాత తన కత్తిని బయటకు తీసి, పేపర్‌ అక్కడే పడేశాడు. ‘పని’ పూర్తయిన తర్వాత ముఠా సభ్యులు వేర్వేరుగా పారిపోయి షోలాపూర్‌లో కలుసుకుని సొత్తు పంచుకున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు ఆంగ్ల పేపర్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.



దానిపై ఉన్న మచ్చల్ని బట్టి, బాధితులు చెప్పిన దాన్ని బట్టి ముఠా సభ్యులు తెచ్చిందిగా నిర్థారించారు. అది ముంబై పత్రికని తేలడంతో అక్కడి ముఠాగా భావించారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చైతన్యకుమార్, చార్మినార్‌ ఏసీపీ అంజయ్య నేతృత్వంలో 12 బృందాలు ఏర్పాటు చేశారు. మరో రెండు టీమ్స్‌ ఘటనాస్థలి పరిసరాలు, ఇతర చోట్ల ఉన్న 300 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను పరిశీలించింది. క్రైమ్‌ జరిగిన కార్ఖానాకు 100 మీటర్ల దూరంలో ఉన్న కెమెరాలో నమోదైన దృశ్యాలను బట్టి టోపీలు, వెనుక తగిలించుకునే బ్యాగ్‌లు, మాస్క్‌లతో ఉన్న 10 మంది అనుమానితులను గుర్తించారు. 

‘నంబర్‌.1’ మా లక్ష్యం : కొత్వాల్‌ అంజనీ కుమార్‌

ßæదరాబాద్‌: ‘ఇప్పటికే దేశంలో హైదరాబాద్‌ పోలీసులకు మంచి పేరుంది. దీనిని మరింత పెంచడంతో పాటు దేశంలో సిటీ పోలీసు, తర్వాత తెలంగాణ పోలీసు నెంబర్‌.1 స్థానంలో ఉండేలా చూడటమే తమ లక్ష్యం’ అని సిటీ కొత్త కొత్వాల్‌ అంజనీ కుమార్‌ అన్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా అధికారికంగా గురువారం మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఇలాంటి సమావేశం మరికొన్ని రోజుల తర్వాత నిర్వహించాలని భావించానని, అయితే బందిపోటు దొంగ చిక్కడంతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నేపథ్యంలో తన భావాలు వ్యక్తం చేస్తున్నానన్నారు. ‘ నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి హైదరాబాద్‌ సిటీలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీన్ని ఓ బాధ్యతగా భావించి నెరవేర్చుతా. సిటీకి సంబంధించి సేఫ్, సెక్యూరిటీ, ప్రజల హ్యాపీనెస్‌.. ఇవే పోలీసుల ప్రాధాన్యాలు. గత సీపీ, ప్రస్తుతం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు ఫ్రెండ్లీ పోసింగ్, సిబ్బంది వ్యవహారశైలిలో మార్పుతో పాటు ఆధునికతకు పోలీస్‌ను కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారు. వాటిని కొనసాగిస్తూ నెంబర్‌.1 స్థానం సంపాదిస్తాం. ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌కు అనేక మంది కొత్త అధికారులు వచ్చారు. అందరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చే వారం మీడియా ముందుకు వస్తాం. అందరినీ మీ ద్వారా నగర వాసులకు పరిచయం చేస్తా. సిటీ పోలీసు విభాగంలో ప్రొఫెషనలిజం మరింత పెంచడానికి కృషి చేస్తా’ అన్నారు. 

బంగారం కార్ఖానాల జియో ట్యాగింగ్‌ 

దేశంలోని అనేక నగరాల్లో ఉన్న బడా వ్యాపార సంస్థలకు అవసరమైన బంగారు ఆభరణాలు పాతబస్తీలోనే తయారవుతాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 600 వరకు కార్ఖానాలు ఉండగా.. వీటిలో 2 వేల మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు పని చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఆయా ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించాం. ఈ నెల 6న పేట్లబురుజు వద్ద చోటు చేసుకున్న బందిపోటు దొంగతనంతో మరింత అప్రమత్తం అయ్యాం. ఆయా కార్ఖానాల నిర్వాహకులతో సమావేశమై సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యల పెంపుపై చర్చించాం. ఇప్పటికే అన్ని కార్ఖానాల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇతర భద్రతా చర్యలపై నోటీసులు జారీ చేస్తాం. మరోపక్క పక్కా నిఘా ఉంచడం కోసం ఆయా కార్ఖానాలకు జియోట్యాగింగ్‌ చేయనున్నాం. పేట్లబురుజు ఉదంతంలో బందిపోటు దొంగలు ఎత్తుకుపోయింది లెక్కల్లో ఉన్న బంగారమా? లేనిదా అనేది ఆదాయపుపన్ను శాఖ  అధికారులు తేలుస్తారు. ఈ మేరకు వారికి సమాచారం ఇచ్చాం.     – వి.సత్యనారాయణ, దక్షిణ మండల డీసీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement