
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు హేమంత్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణలో భాగంగా హేమంత్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సతీశ్‌ను తానే హతమార్చినట్లు అంగీకరించిన హేమంత్..ఈ హత్యతో ప్రియాంకకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అదే విధంగా అందరూ భావిస్తున్నట్లుగా సతీశ్- ప్రియాంకల మధ్య వివాహేతర సంబంధం లేదని హేమంత్ తెలిపాడు. కాగా కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీలో సతీశ్ దారుణ పరిస్థితుల్లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార భాగస్వామి హేమంత్ అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
చదవండి : సతీశ్ హత్యకేసులో కొత్త కోణాలు
ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా సతీశ్, హేమంత్‌లకు పరిచయమున్న ప్రియాంక అనే అమ్మాయి కారణంగానే హత్య జరిగిందని భావించారు. ఏడాది కాలంగా భార్యకు దూరంగా ఉంటున్న హేమంత్‌ను... ప్రియాంకతో సాన్నిహిత్యం తగ్గించుకోవాలని సతీశ్ హెచ్చరించినందుకే అతడి హత్య జరిగిందని అనుమానించారు. అదే విధంగా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో సతీశ్ కాల్‌డేటా పరిశీలించిన అనంతరం హేమంత్‌ను అదపులోకి తీసుకుని.. సీసీటీవీ ఫుటేజీ సహా పలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం హేమంత్ నేరం అంగీకరించడంతో.. అతడికి ఎవరు సహకారం అందించారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment