
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్యకేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ స్నేహితుడు హేమంత్ పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా స్నేహితుల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తలెత్తినట్లు ప్రియాంక పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే...వాళ్లిద్దరూ బాల్య స్నేహితులు... చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత విద్య పూర్తి చేసి ఏడాది క్రితమే వ్యాపారం ప్రారంభించారు. ఏమైందో ఏమో గానీ వ్యాపార భాగస్వామిగా ఉన్న స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేయడమేగాక ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్‌తో పార్శిల్ చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ఆ శవాన్ని ఇంట్లోనే వదిలేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు.
చదవండి: కేపీహెచ్బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య
ప్రకాశం జిల్లా, మార్టూరుకు చెందిన మైలా సతీష్‌బాబు (35), భీమవరానికి చెందిన హేమంత్ కోరుకొండ సైనిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసి వచ్చిన సతీష్‌బాబు.. ఏడాది క్రితం హేమంత్‌తో కలసి కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో ఐటీ స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సతీష్‌బాబు తన భార్య ప్రశాంతితో కలసి మూసాపేట ఆంజనేయనగర్‌లో ఉంటున్నాడు. హేమంత్ కుటుంబం ఆల్వాల్‌లో నివాసం ఉంటుండగా, అతను కేపీహెచ్‌బీలోని 7వ ఫేజ్‌లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు.
ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఐటీ విద్యార్థులకు తరగతులు చెప్పే సతీష్ బాబు.. ఐటీ సంస్థ కార్యకలాపాలు చూసుకునేవాడు. బుధవారం రాత్రి క్లాస్ ముగిసిన అనంతరం కార్యాలయానికి వచ్చాడు. 10.30 గంటల ప్రాంతంలో తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో ప్రశాంతి అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. గురువారం అతని ఆచూకీ తెలియకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హేమంత్
సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో అనుమానం..
సతీష్ బాబుతో పాటు హేమంత్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ప్రశాంతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు హేమంత్ కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ద్వారా ఆధారంగా అతను కేపీహెచ్‌బీ 7వ ఫేజులో ఉన్నట్లు గుర్తించారు. హేమంత్ ఇంటికి వెళ్లిన పోలీసులకు దుర్వాసన రావడంతో తాళం పగులగొట్టి చూడగా సతీష్ దారుణంగా హత్యకు గురై కనిపించాడు. గొంతు కోసి ఉండటంతో పాటు కడుపు, కాళ్లపై కత్తిగాట్లున్నాయి. కుడికాలు మోకాలు వరకూ కట్‌చేసి ఉంది.
ఇంట్లో పెద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు, పొడవాటి టీవీ అట్టపెట్టెలు కనిపించాయి. మృతదేహంపై ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. దీంతో హేమంతే ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నాలుగు నెలల క్రితమే ఆఫీస్ సమీపంలో ఇండిపెండెంట్ హౌస్‌ను అద్దెకు తీసుకోవడం మొదలు సతీష్ బాబును ఇంటికి రప్పించి హత్య చేసే వరకూ పథకం ప్రకారమే సాగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో హేమంత్‌తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment