అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్న హేమంత్‌ | Madhapur DCP Press Meet Over Software Employee Sathish Murder Case | Sakshi
Sakshi News home page

‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’

Published Thu, Sep 5 2019 4:28 PM | Last Updated on Thu, Sep 5 2019 5:02 PM

Madhapur DCP Press Meet Over Software Employee Sathish Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు.  ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్‌ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు.  ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్‌ సతీష్‌ను  హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 

(చదవండి : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య)

 ‘గత నెల 28న సాఫ్టవేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడు హేమంత్‌ను అరెస్ట్‌ చేశాం. విచారణలో  సతీష్ స్నేహితుడు హేమంత్ పై అనుమానం వచ్చింది. దీంతో అతని ఇంటికి వెళ్లి చూశాం. హేమంత్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తాళం విరగొట్టి చూస్తే సతీష్ బాడీ ఇంట్లో ఉంది. దీంతో హేమంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పకున్నాడు.

అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్నాడు
సతీష్, హేమంత్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. సతీష్ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి , సాఫ్ట్ వేర్ సోల్యూషన్ లో కోచింగ్ ఇస్తున్నాడు. మరో వైపు హేమంత్‌ చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ మధ్యలోనే మానేసేవాడు. ఓ సందర్భంలో సతీష్‌ను హేమంత్‌ కలుసుకొని ఉద్యోగం ఇప్పించమని కోరారు. దీంతో తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత హేమంత్‌, సతీష్‌ భాగస్వాములుగా ఓ ఐటీ కంపెనీని నిర్వహించారు. ఈ సందర్భంగా 2016లో తన దగ్గర కోచింగ్‌ తీసుకొని తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న ప్రియాంకను సతీష్‌ హేమంత్‌కు పరిచయం చేశాడు. అంతకు ముందే సతీష్‌కు ప్రియాంకకు మధ్య సాన్నిహిత్యం ఉండేది. ప్రియాంక కేపీహెచ్‌బీలో హాస్టల్‌లో ఉండేది. కాగా కొద్ది రోజుల తర్వాత ప్రియాంకతో హేమంత్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం హేమంత్‌ భార్యకు తెలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో హేమంత్‌, ప్రియాంక ఒక గది రెంట్‌కి తీసుకొని ఉంటున్నారు. గత మూడు నెలలుగా హేమంత్‌, ప్రియాంక ఒకే గదిలో ఉన్నారు. ఈ విషయం సతీష్‌కు తెలియడంతో హేమంత్‌ను హెచ్చరించాడు. ఆ అమ్మాయికి భవిష్యత్‌ ఉందని, ఆమెతో కలిసి ఉండొద్దని హేమంత్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. అలాగే కంపెనీకి నష్టాలు రావడంతో జీతం కూడా తగ్గించాడు. అప్పటి నుంచి సతీష్‌పై హేమంత్‌ ద్వేషం పెంచుకున్నాడు. ప్రియాంక దూరం అవుతుందని, భావించి కక్ష పెంచుకొని సతీష్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు.

పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు
 గత నెల 28న సతీష్‌ను హేమంత్‌ తన ఇంటికి ఆహ్వానించారు. పార్టీ చేసుకుందని చెప్పి నమ్మించి ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం ఇద్దరు మద్యం సేవించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో సతీష్‌ను దారుణంగా హత్య చేశాడు. సుత్తెతో సతీష్‌ తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం బాడీని కారులో తరలించాలని చూశాడు. ప్యాకింగ్‌ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. తిరిగి రూమ్‌లోకి వచ్చిన హేమంత్‌.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్‌, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడు హేమంత్‌ అని తేల్చాం’ అని డీసీపీ మీడియాకు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement