
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసు నిందితుడు హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. సతీష్‌ను తాను ఒక్కడినే హత్య చేశానని, ఇందులో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గత నెల 27న సతీష్‌ను హేమంత్ దారుణంగా హత్య చేశాడు. స్నేహితురాలు ప్రియాంకను హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సతీష్.. రాత్రి 8 గంటలకు హేమంత్ రూమ్‌కి వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మాటల మధ్యలో ఆఫీస్‌లో పనిచేస్తున్న అమ్మాయితో హేమంత్‌కు ఉన్న అక్రమ సంబంధ విషయం చర్చకు వచ్చింది. అక్రమ సంబంధం మానుకోవాలని హేమంత్‌ను సతీష్ హెచ్చరించాడు.
(చదవండి : సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు)
దీంతో భయపడిన హేమంత్.. ఈ విషయాన్ని సతీష్ అందరికి చెబుతాడని, ఎప్పటికైనా తనకు అడ్డుతగులుతాడని భావించి హత్యకు కుట్ర పన్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో సతీష్ మెడ కోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలని భావించాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. అనంతరం రూమ్‌లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. మరుసటి రోజు స్నేహితులతో గడిపాడు. అనంతరం హత్య విషయాన్ని తన సన్నిహితులకు చెప్పాడు. వారు పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చారు. కానీ హేమంత్ మాత్రం లొంగిపోకుండా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. సతీష్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమంత్ కోసం ముమ్మరంగా గాలించారు. సోమవారం పోలీసులకు పట్టుబడిన హేమంత్.. నిజాన్ని ఒప్పకున్నాడు. హత్యతో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని, ఒక్కడినే హత్య చేశానని హేమంత్ పోలీసులు ఎదుట ఒప్పకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment