
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసులో రోజు రోజుకి కొత్త కోణాలు బయటపడుతున్నాయి. స్నేహితురాలు ప్రియాంకతో సతీష్ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకనే హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సతీష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే హత్య చేసిన రోజు హేమంత్ ఇంటికి సతీష్ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రోజు ప్రియాంకను సతీష్ హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సీసీ పుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ప్రియాంకను హాస్టల్‌లో డ్రాప్ చేసిన తర్వాత సతీష్ ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా మారింది.
(చదవండి : ఆమె’ కోసమేనా హత్య?)
ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్‌ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. గత నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్‌ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే సతీష్‌ను హత్య చేయడానికి హేమంత్‌కు ఎవరు సహాయం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment