
గజ్వేల్: అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసి కొమ్మిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి (39) ఈనెల 19న పనిచేస్తున్న కార్యాలయంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. అతని భార్య ప్రసవానికి ముందు రోజు జరిగిన ఈ ఘటన వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొన్నేళ్ల క్రితం అమెరికాలోని డల్లాస్‌లోగల ఓ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ దివ్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
వీరికి మూడేళ్ల పాప ఉన్నది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దివ్యకు.. భర్త మృతి విషయం చెప్పకుండా...వారి స్నేహితులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి 20న డెలివరీ చేయించారు. ఆ తర్వాత భర్త మరణించాడనే సమాచారం తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ప్రశాంత్ స్నేహితుడు, గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కుమారుడు సంతోష్, డల్లాస్‌లో జరిగే అంత్యక్రియలకు మృతుని సోదరుడు ప్రమోద్ వెళ్లేందుకోసం వీసా ఇప్పించాలని ట్వీటర్‌లో కేటీఆర్‌ను కోరగా ..అమెరికా ఎంబసీ అధికారులతో కేటీఆర్ మాట్లాడి వీసా వచ్చేలా చొరవ చూపడంతో ప్రమోద్ అమెరికా బయలుదేరి వెళ్లారు.