
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రైల్వే కోడూరులో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజుల్లో వివాహ బంధంలో అడుగుపెట్టనున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. వివరాలు.. రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్(26) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఈనెల 23న తన మేనమామ కూతురితో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బుధవారం రంజాన్ పండుగ సందర్భంగా రైల్వే కోడూరుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున శ్రీకృష్ణ సినిమా హాల్ దగ్గరికి రాగానే గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కాగా చేతికి అందివచ్చిన కొడుకు హత్యకు గురికావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొన్నిరోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment