పాలకొల్లులో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావు
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: కన్నతండ్రిని ఆస్తి కోసం అత్యంత పాశవికంగా హతమార్చి.. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా తండ్రి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తనయుడి ఉదంతమిది. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడంతో భయపడిన తనయుడు గ్రామ పెద్దలు వద్దకు వెళ్లి నిజం ఒప్పుకోవడంతో వారి సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుగొండ మండలం ములపర్రు గ్రామ శివారు చెరువుపేటకు చెందిన దాకవరపు ఆశీర్వాదం అనే వ్యక్తికి రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య విజయకుమారి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా సూరంపూడికి చెందిన ఎస్తేరు రాణిని ఆయన వివాహం చేసుకున్నాడు.
మొదటి భార్యకు మనోజ్‌కుమార్, పవన్‌కుమార్ ఇద్దరు కుమారులు, రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నారు. ఆశీర్వాదంకు రెండు ఎకరాలు పొలం ఉండగా ఆ పొలాన్ని తనకు రాయాలని మనోజ్‌కుమార్ కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడు. అయితే ఇందుకు తండ్రి ఆశీర్వాదం ససేమిరా అనడంతో మనోజ్‌కుమార్ కక్ష పెంచుకున్నాడు. ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న మనోజ్‌కుమార్ ఈ ఏడాది జనవరి 19న రాత్రి 8 గంటల సమయంలో షాపు మూసివేసి పొలంలో ఉన్న తండ్రి వద్దకు వెళ్లాడు. ఆస్తి తన పేరున రాయాలని నిలదీయడంతో ఆశీర్వాదం అంగీకరించలేదు. ఆగ్రహానికి గురైన మనోజ్‌కుమార్ ప్లాస్టిక్ తాడును ఆశీర్వాదం మెడకు చుట్టి బిగించి హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికీ ఏమీ తెలియనట్టు పొలానికి వచ్చి చూసి తండ్రి మృతిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు.
పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని విచారణ చేస్తుండగా గురువారం గ్రామ పెద్దల వద్దకు మనోజ్‌కుమార్ వెళ్లి తానే తన తండ్రిని చంపేశానని చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మనోజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. పట్టణ సీఐ సీహెచ్ ఆంజనేయులు పాల్గొన్నారు. డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో పెనుగొండ సీఐ పి.సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో పెనుగొండ ఎస్సైపి.నాగరాజు, ఇరగవరం ఎస్సై జె.సతీష్, పెనుమంట్ర ఎస్సై ఈ.శ్రీనివాస్ మూడు బృందాలుగా కేసు దర్యాప్తు చేశారు. వీరితో పాటు కేసు ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ డీవీడీ వాసు, పోలీసు శంకర్, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, శ్రీనివాసు, కానిస్టేబుల్స్ వెంకట్రావు, రాజేష్, హరికృష్ణ తదితరులను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment