అప్పారావు ,లక్ష్మి
పశ్చిమగోదావరి, టి.నరసాపురం: భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఏకంగా కట్టుకున్న భార్య భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో జరిగింది. సినీ ఫక్కీలో మంచానికి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి, మెడకు మరో తాడును బిగించి, నడుమును మంచానికి చీరతో కట్టేసి బ్లేడుతో మర్మాంగాన్ని కోసి భర్తను భార్య హతమార్చిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. హత్యానంతరం బంధువులకు సమాచారం అందించి పారిపోయిన నిందితురాలు చివరకు పోలీసులకు లొంగిపోయింది. చింతలపూడి సీఐ పి.రాజేష్, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.(ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో)
ఐదేళ్లుగా గొడవలు..
ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడెంలోని ఊరగుంట కొత్తపేటకు చెందిన కఠారి అప్పారావు (35)కు తెలంగాణలోని దమ్మపేట గ్రామానికి చెందిన లక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో అప్పారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే మట్టి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సక్రమంగానే సాగినప్పటికీ అప్పారావు ఐదేళ్ల క్రితం మద్యానికి బానిసై భార్యను వేధించడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, పలుమార్లు గ్రామపెద్దలు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మట్టి తోలకానికి అప్పారావు వెళ్లగా నిందితురాలు లక్ష్మి తన కుమార్తెను పుట్టింటికి పంపించింది. భర్త వేధింపులకు విరక్తి చెందిన భార్య కఠారి లక్ష్మి అప్పారావును అత్యంత దారుణంగా బుధవారం రాత్రి హత్య చేసింది.
అప్పారావు మృతదేహం
సినీ ఫక్కీలో..
మద్యం సేవించి ఉన్న అప్పారావును భార్య లక్ష్మి నవ్వారు మంచానికి రెండు వైపులా తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసింది. నడుముకు చీర, మెడకు తాడు బిగించింది. బ్లేడుతో మర్మాంగాలు కోసి హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారైంది. గురువారం ఉదయం మృతుడు అప్పారావు అన్న కఠారి నాగేశ్వరరావుకు లక్ష్మి ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంట్లో ఉన్నాడు చూసుకోండి అంటూ సమాచారం ఇవ్వడంతో వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా, అప్పారావు విగత జీవిగా పడి ఉన్నాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో చింతలపూడి సీఐ రాజేష్, తడికలపూడి ఎస్సై కె.వెంకన్న , ట్రైనీ డీఎస్పీ హర్షిత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్‌ఓ బోసు సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు. ఇదిలా ఉండగా, నిందితురాలు లక్ష్మి బంధువుల ద్వారా వెళ్లి గురువారం సాయంత్రం టి.నరసాపురం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment