శుక్రవారం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం అలేబాదుతండా వద్ద నాటుసారా బట్టీని ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్ అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుసారాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ప్రత్యేక బృందాల ద్వారా ఈ వారం అంతా ఆకస్మిక దాడులు చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ణయించారు. నాటుసారాపై ఫిర్యాదులు స్వీకరించి దాడులు చేసేందుకు ఎక్సైజ్ కమిషనరేట్‌లో 1800 425 4868 టోల్ ఫ్రీ నంబరుతోపాటు రెండు బెటాలియన్ల పోలీసులను సిద్ధం చేశారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసుల సహకారంతో సారా మహమ్మారిని తరిమికొట్టాలని ఎక్సైజ్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
మూడు కేటగిరీలుగా విభజన
రాష్ట్రంలోని 191 మండలాల్లో కాపుసారా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 682 గ్రామాల్లో కాపుసారా తయారీ, విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల వద్ద సమాచారం ఉంది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో దీనిప్రభావం అత్యధికంగా ఉంది. కాపు సారా తయారీని ‘ఏ’ కేటగిరీ, విక్రయాలను ‘బి’ కేటగిరీ, సరఫరాను ‘సీ’ కేటగిరీగా విభజించారు. ఏ కేటగిరీలో 141 గ్రామాలు, బీ కేటగిరీలో 249 గ్రామాలు, సీ కేటగిరీలో 292 గ్రామాలున్నాయి.
నాలుగు నెలల్లో 5,687 కేసులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కాపుసారా తయారీపై 5,687 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 3,410 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం కేసులు అధికంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దాడుల్లో 378 వాహనాల్ని సీజ్ చేశారు.
రెండు నెలల్లో నియంత్రిస్తాం
రాష్ట్రంలో సారా అనేది లేకుండా చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. రెండు నెలల్లో కాపు సారాను నియంత్రించేలా కార్యాచరణ రూపొందించాం. ‘ఏ’ కేటగిరీ గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తయారీదారుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– ఎం.ఎం. నాయక్, ఎక్సైజ్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment