సాక్షి, ప్రకాశం : పశ్చిమ ప్రాంతంలో నాటుసారా సరఫరాలో కింగ్ మేకర్‌గా పేరు పొందిన నాగులూరి ఏసును ఎక్కడున్నా అరెస్టు చేసి తీరుతామని మార్కాపురం ఈఎస్ ఆవులయ్య హెచ్చరించారు. సోమవారం రాత్రి 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈఎస్ కథనం ప్రకారం.. పొదిలి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో గోగినేనివారిపాలెం సమీపంలో 100 లీటర్ల నాటుసారా స్వా«దీనం చేసుకుని అరుణ్‌కుమార్, కోటేశ్ అనే ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
వీరిని విచారణ చేయగా వచ్చిన సమాచారం మేరకు చీమకుర్తి మండలం గురవారెడ్డిపాలేనికి చెందిన షేక్ బీబీని అరెస్టు చేశారు. మరో వైపు విచారణలో సారా అమ్మకాలు సాగిస్తున్న పోలా ఏసును సింగరాయకొండ సీఐ లత ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వీరి నుంచి 20 లీటర్ల నాటుసారా, 75 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీరికి కింగ్ మేకర్‌గా నాగులూరి ఏసు వ్యవహరిస్తున్నారు.
నాగులూరి కుటుంబ సభ్యుల సహకారంతో విచ్చలవిడిగా నాటుసారా కేంద్రాలను గతంలో నిర్వహించారు. అతడిని పది రోజుల్లో అరెస్టు చేస్తామని ఈఎస్ ఆవులయ్య విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. నాటుసారా తయారీని అరికట్టేందుకు తమ శాఖ కృత నిశ్చయంతో ఉందన్నారు. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌ను నియమించినట్లు చెప్పారు. నాగులూరి ఏసు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment