సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ తనపై ఏడాడి పాటు లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డాడని ఆయన నిర్వహించే కళాశాలకు చెందిన లా స్టూడెంట్ ఆరోపించిన క్రమంలో స్వామి బాగోతాలపై బాధితురాలు మరికొన్ని వివరాలు వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆమె స్వామిపై ఆరోపణలకు ఆధారాలను అందచేసినట్టు తెలిసింది. యూపీలోని షహజన్‌పూర్‌లో లా కోర్సులో అడ్మిషన్ కోసం తాను గత ఏడాది జూన్‌లో చిన్మయానంద్‌ను తాను తొలిసారి కలిశానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్మయానంద్ తన ఫోన్ నెంబర్ తీసుకుని తనకు లా కాలేజ్‌లో అడ్మిషన్ ఇప్పించారని, కాలేజ్ లైబ్రరీలో నెలకు రూ 5000 వేతనానికి ఉద్యోగం కల్పించారని చెప్పుకొచ్చారు.
అక్టోబర్‌లో తనను హాస్టల్‌కు మారాలని స్వామి చిన్మయానంద్ కోరారని, ఆ తర్వాత ఆశ్రమానికి పిలిపించారని చెప్పారు. ఆశ్రమంలో స్వామిని కలవగా తాను హాస్టల్‌లో స్నానం చేస్తున్న వీడియోను చూపి తాను చెప్పినట్టు వినకుంటే దాన్ని వైరల్ చేస్తానని బెదిరించి లోబరుచుకున్నాడని ఆరోపించారు. లైంగిక దాడి దృశ్యాలనూ రికార్డు చేసిన చిన్మయానంద్ వాటిని చూపి బ్లాక్‌మెయిల్ చేసేవాడని చెప్పారు. స్వామి శిష్యులు తనకు తుపాకీ గురిచూపి ఆయన వద్దకు తీసుకువెళ్లేవారని, ఆయనకు తనతో మసాజ్ చేయించేవారని అన్నారు. ఈ ఏడాది జులై వరకూ ఈ వికృత చర్యలు కొనసాగాయని, చిన్మయానంద్ దుశ్చర్యలపై వీడియోలను రూపొందించాలని నిర్ణయించుకుని ఈ ఏడాది ఆగస్ట్‌లో ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్ చేసి కాలేజీ నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. మరోవైపు చిన్మయానంద్ తన కుమార్తెతో పాటు పలువురు యువతులను లైంగికంగా వేధించాడని బాధితురాలి తండ్రి యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్మయానంద్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు యువతి ఆరోపణలను స్వామి చిన్మయానంద్ న్యాయవాది తోసిపుచ్చారు. స్వామి ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment