కక్షకట్టి ‘లొకంటో’కీడ్చాడు! | Student Harassment on Classmate in hyderabad | Sakshi
Sakshi News home page

కక్షకట్టి ‘లొకంటో’కీడ్చాడు!

Published Sat, Aug 25 2018 8:34 AM | Last Updated on Mon, Aug 27 2018 1:37 PM

Student Harassment on Classmate in hyderabad - Sakshi

నిందితుడు భానుప్రకాష్‌

సాక్షి, సిటీబ్యూరో:  కాలేజ్‌లో చోటు చేసుకున్న చిన్న వాగ్వాదం నేపథ్యంలో ఓ యువతిపై కక్షగట్టిన ప్రబుద్ధుడు ఆమెను ‘లొకంటో’కీడ్చాడు. యువతి ఫొటోలతో పాటు అశ్లీలమైన రాతలు జోడించి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితుడు వి.భానుప్రకాష్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ తెలిపారు. బడంగ్‌పేట్‌కు చెందిన భాను ప్రకాష్‌ నగరంలోని ఓ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు.

ఇదే కళాశాలతో ఇతడి స్నేహితుడు అఖిల్‌ మరో బ్రాంచ్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. అఖిల్‌ ఓ రోజు తన క్లాస్‌రూమ్‌లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో భాను ప్రకాష్‌ అక్కడకు వెళ్ళి సపర్యలు చేయడానికి సిద్దమయ్యాడు. అయితే దీనికి ప్రొఫెసర్‌ అభ్యంతరం చెప్పడంతో పాటు ఓ విద్యార్థినితో వాగ్వాదం జరిగింది.   ఆమెపై కక్షకట్టిన ప్రకాష్‌ లొకంటో సైట్‌లో ఆమె ఫొటోలతో ఖాతా తెరిచాడు. అశ్లీలమైన రాతలు రాయడంతో పాటు ఆమె సెల్‌నెంబర్‌ ఇచ్చాడు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.   

అతివలకు ‘హెల్‌’ఫోన్‌...
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు సెల్‌ఫోన్‌ వేధింపులు ఎదురయ్యాయి. వారి ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సిటీ షీ–టీమ్స్‌ నిందితుల్ని పట్టుకున్నాయి.డిగ్రీ విద్యార్థినికి తన స్నేహితురాలి ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమె తన సోదరుడిగా పరిచయం చెయ్యడంతో పాటు అతడి కోరడంతో బాధితురాలు తన సెల్‌ నెంబర్‌ చెప్పింది. అప్పటి నుంచి ఎస్సెమ్మెస్‌లు, కాల్స్‌తో వేధింపులు మొదలయ్యాయి. ఆమెకు వివాహమైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న అతగాడు రూ.50 లక్షలు డిమాండ్‌ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీ–టీమ్స్‌ గాంధీనగర్‌కు చెందిన తరుణ్‌ను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించాయి. అలాగే ఫోన్‌ వేధింపులకు పాల్పడుతున్న గోపాల్‌ రాజ్‌ జైన్, ఎం.ఉపేందర్, నరేష్‌ వ్యాస్‌లను పట్టుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement