‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’ | Suraj Pancholi Described Rabia Khan Behavior on Jiah Khan Suicide Case | Sakshi
Sakshi News home page

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

Published Thu, Oct 31 2019 1:41 PM | Last Updated on Thu, Oct 31 2019 2:22 PM

Suraj Pancholi Described Rabia Khan Behavior on Jiah Khan Suicide Case - Sakshi

సాక్షి, ముంబై : వర్ధమాన బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ 2013 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడైన సూరజ్‌ పంచోలీ గురువారం మీడియాపై మండిపడ్డాడు. సంచనాల కోసం మీడియా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా తానే దోషినని మీడియా తీర్పు ఇచ్చేసిందని విచారం వ్యక్తం చేశారు.  ‘నా గురించి మీడియా రాసిన వార్తల్లో కనీసం 5 శాతం కూడా నిజాలు లేవు. కానీ, ఈ దేశంలో తీర్పిచ్చేది కోర్టులే గానీ మీడియా కాదు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది నాకు ముఖ్యం. తీర్పు కోసం వేచి చేస్తున్నా’నని వ్యాఖ్యానించారు. 

కేసు గురించి వివరిస్తూ.. ‘గత ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతుంది. జియాఖాన్‌ చావుకు నేనే కారణమని ఆరోపించిన ఆమె తల్లి రబియా ఖాన్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. ఆమెకు బ్రిటన్‌ పాస్‌పోర్టు ఉంది. దీన్ని బట్టి ఎవరు దోషులో అర్థమవుతోంది. కానీ మీడియా ఇవేమీ పట్టించుకోదు. ఆ సంఘటన జరిగినప్పుడు నా వయస్సు 22 ఏళ్లు. చుట్టూ ఏం జరుగుతుందో అర్థమయ్యేదికాదు. నాపై వచ్చిన ఆరోపణలు నిజం కావని తెలుసు. ఈ దేశంలో ఒక అమాయక వ్యక్తిపై నిందితుడని ముద్ర వేశాక అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం. అయినా విచారణ జరిపించి దోషులను తేల్చాలని కోర్టుకు విజ్ఞప్తి చేశా. దేశంలోనే తనపై విచారణ చేయమని కోర్టును అడిగిన నిందితుడిని బహుశా నేనే అనుకుంటా. మీడియా వైఖరి వల్ల బాధపడేది నేనొక్కణ్ణే కాదు. నాకూ ఫ్యామిలీ ఉంది. వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు నా కెరీర్‌ను చూసుకోవాలి. జనాల నుంచి ఎలా సానుభూతి పొందాలో కూడా నాకు తెలియద’ని విశ్లేషించారు. 

కాగా ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌ పంచోలి... సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన ‘హీరో’ సినిమాతో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత నుంచి ఏ ఒక్క సినిమాకు కమిట్‌ అవలేదు. దీనికి కారణం అడగగా, రొటీన్‌ కథలే ఎక్కువగా వస్తున్నాయని, వాస్తవ కథల కోసం ఇన్నాళ్లూ వెయిట్‌ చేశానని చెప్పారు. ఇప్పుడు శాటిలైట్‌ శంకర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సూరజ్‌. నవంబర్‌ 8న విడుదలవుతోన్న ఈ సినిమా కథాంశం గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఆర్మీ జవాన్‌గా నటించాను. ఇంత వరకు సైనికులను హీరోలుగా చూపెడుతూ ఉరీ, బార్డర్‌ వంటి సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో సైనికుల పట్ల సమాజం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలనే విషయాన్ని చర్చించాం’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement