
మృతి చెందిన సంధ్యారాణి , శిశువు
కర్నూలు : అమె 8 నెలల గర్భ వతి.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త అనుమానం పెంచుకున్నాడు. నిత్యం సూటిపోటి మాటలో వేధించేవాడు. గురువారం క్షణికావేశంలో కత్తితో కట్టుకున్న భార్యనే కాకుండా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువునూ హతమార్చాడు. ఈ ఘటన కర్నూలులో సంచలనంగా మారింది. వైఎస్సార్ జిల్లా ఎర్రముక్కల గ్రామానికి చెందిన సంధ్యారాణికి అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్‌తో వివాహమైంది. ఇన్వర్టర్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంధ్యారాణి ఎనిమిది నెలల గర్భవతి కాగా..ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదు.
విశ్వనాథ్ చెల్లెలు సుధ కర్నూలులోని మాంటెస్సోరి స్కూల్ వద్ద ఉన్న అగ్రసేని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. విశ్వనాథ్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వైద్యునికి చూపించుకునేందుకు భార్య సంధ్యారాణితో కలసి రెండు రోజుల క్రితం చెల్లెలు ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం చెల్లెలు సుధ బాత్‌రూమ్‌లో ఉండగా సంధ్యారాణి వరండాలో కూర్చుని ఉంది. కొంతకాలంగా భార్యపై అనుమానంగా ఉన్న విశ్వనాథ్ అకస్మాత్తుగా కత్తితో దాడిచేసి ఆమెను గాయపరిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా..వైద్యులు సిజేరియన్ చేసి శిశువును తీశారు. చికిత్స పొందుతూ సంధ్యారాణి (34) గురువారం రాత్రి మృతి చెందింది. కొద్ది సేపటికే శిశువు కూడా శ్వాస విడిచింది. విషయం తెలిసిన వెంటనే సంధ్యారాణి కుటుంబ సభ్యులు కర్నూలుకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కర్నూలు మూడో పట్టణ పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.