మారుతి ఏమయ్యాడు..? | Sweet Shop Owner Missing At Adilabad | Sakshi
Sakshi News home page

మారుతి ఏమయ్యాడు..?

Published Thu, Aug 22 2019 8:57 AM | Last Updated on Thu, Aug 22 2019 8:57 AM

Sweet Shop Owner Missing At Adilabad - Sakshi

సాక్షి, భైంసా(ఆదిలాబాద్‌) : భైంసా పట్టణంలోని భజరంగ్‌ స్వీ ట్‌ హోం యజమాని మారుతి ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు నెల రోజులు గడుస్తోంది. దీం తో అతని కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు కూడా నమోదు చేశారు. అయితే స్థానికంగా నమ్మకంగా వ్యాపారం నిర్వహిస్తూ వచ్చిన మారుతి తనకు తెలిసిన పలువురి వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో రూ.లక్షల్లో అప్పులు కావడంతో, గత నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు అçప్పుల బాధ తాళలేక ఇం టి నుంచి వెళ్లిపోతున్నానని, తన కోసం వెతకవద్దంటూ అతని కొడుకు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పెట్టాడు. దీంతో అప్పులు ఇచ్చినవారు, అతని దుకాణంలో పాలు పోసేవారు ఆందోళనకు గురయ్యారు. మారుతి ఫోన్‌ స్విచాఫ్‌ వస్తుండడంతో తాము మోసపోయామని లబోదిబోమన్నారు.

ఉద్దేశపూర్వకంగానే ఉడాయింపు
దాదాపు ఏడెనిమిదేళ్లుగా భైంసా పట్టణంలోని బోయిగల్లి ప్రాంతంలో మిఠాయి దుకాణం నిర్వహించిన మారుతి అందరి వద్దా అప్పులు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.అరకోటి వరకు అప్పులు చేశాడని పలువురు పేర్కొంటున్నారు. కానీ ఎంత మొత్తం అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే దాదాపు తెలిసిన వారందరి వద్ద అప్పులు చేశాడని అతని గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఇలా అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ చెల్లించేవాడని, దీంతో చాలామంది అతనికి మళ్లీ అప్పులు ఇచ్చేవారని తెలిసింది. ఇంకా చాలా మంది అధిక వడ్డీలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అప్పులు ఇచ్చినవారు మాత్రం బయటికి రావడం లేదు. కనీసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సదరు వ్యాపారి ఉద్దేశపూర్వకంగానే అప్పులు చెల్లించకుండా ఉడాయించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

అధిక వడ్డీకి ఆశపడితే..
సదరు మిఠాయి వ్యాపారి పలువురి వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకునేవాడని తెలిసింది. రూ. 5 నుంచి రూ.10 వరకు వడ్డీ చొప్పున అప్పులు తీసుకునేవాడని, దీంతో చాలామంది అధిక వడ్డీ ఆశతో ఎలాంటి ఆధారాలు, ప్రమాణ పత్రాలు లేకుండానే అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కసారిగా సదరు వ్యాపారి మాయమవడంతో అధిక వడ్డీకి అప్పులు ఇచ్చిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. అధిక వడ్డీలకు ఆశపడి ప్రస్తుతం కనీసం బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఎలాంటి స్థిర, చర ఆస్తులు, బాండ్‌పేపర్‌ వంటి వాటిపై అప్పు ఇచ్చి ఉంటే కనీసం 420 కేసు నమోదు చేసేందుకు వీలుండేదని పలువురు చెబుతున్నారు.

లుక్‌ఔట్‌ నోటీసులు ఇచ్చాం
భజరంగ్‌ స్వీట్‌ హోం నిర్వాహకులు చాబే మారుతి గత నెల 1వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అతని కొడుకు ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశాం. అప్పుల బాధతోనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నాని మెసేజ్‌ పెట్టినట్లు అతని కొడుకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మారుతి ఆచూకీ కోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు లుక్‌ఔట్‌ నోటీసులు ఇచ్చాం. డీసీఆర్‌వోకు సైతం తెలియజేశాం.         
– శ్రీనివాస్, పట్టణ సీఐ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement