సంఘటన స్థలం, ఎమ్మెల్యే
సాక్షి, చెన్నై : స్థల వివాదం కత్తి పోట్లకు దారి తీయడంతో తన చేతిలో ఉన్న తుపాకీతో డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్ ఇష్టానుసారంగా ఫైరింగ్ చేయడం తిరుప్పోరూర్‌లో కలకలం రేపింది. ఇరువర్గాలు వీరంగం సృష్టిస్తూ వాహనాలను తగులబెట్టాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఇదయవర్మన్‌ను అరెస్టు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని చెంగోడు గ్రామంలో అన్నాడీఎంకే నేత తాండవ మూర్తి బంధువుగా పేర్కొంటున్న అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్ 350 ఎకరాల స్థలాన్ని చౌకగా కొనుగోలు చేసి ఉన్నారు.
ఈ స్థలంలోకి వెళ్లేందుకు దారి లేదు. ఇక్కడ ప్లాట్లు వేసి రియల్ వ్యాపారం చేయడానికి సిద్ధమైన కుమార్ రోడ్డు కోసం తన బలాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. గ్రామస్తులు దీనన్ని అడ్డుకుంటూ వచ్చారు. గ్రామ ఆలయానికి సంబంధించిన స్థలం మీదుగా ప్రత్యేక రోడ్డును తన స్థలంలోకి వేయడానికి సిద్ధమయ్యాడు. దీన్ని కూడా అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తుడైన కుమార్ చెన్నై నుంచి శనివారం సాయంత్రం ఓ యాభై మంది కిరాయి ముఠాను ఆ గ్రామంలోకి వెంట బెట్టుకు వెళ్లాడు.
కత్తులతో వీరంగం..ఫైరింగ్
వచ్చీరాగానే కిరాయి ముఠా సినీ తరహాలో చేతిలో కత్తులు, దుడ్డు కర్రలను చేతబట్టి దిగడంతో ఆగ్రామస్తులు భయంతో వెనక్కు తగ్గారు. ఇదే అదునుగా ప్రొక్‌లైయినర్లను రంగంలోకి దించిన కుమార్ అనుచరులు, ఆలయ స్థలం మీదుగా రోడ్డు మార్గానికి తగ్గ పనుల వేగాన్ని పెంచాడు. ఈ సమాచారం అందుకున్న డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్ తండ్రి లక్ష్మీపతి అక్కడకు చేరుకుని కుమార్‌ను నిలదీశాడు. లక్ష్మీపతికి మద్దతుగా గ్రామస్తులు ఏకం కావడంతో వివాదం ముదిరింది. కిరాయి ముఠా దుడ్డు కర్రలతో గ్రామస్తుల మీద దాడులు చేస్తూ, కత్తులతో వీరంగం సృష్టించారు. (కాయ్ రాజా కాయ్.. కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు)
తన తండ్రి మీద దాడి సమాచారంతో ఆగమేఘాల మీద అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఇదయ వర్మన్ పరిస్థితి చూసి తన వాహనంలో ఉన్న సింగిల్ బేరల్ గన్‌ను అందుకున్నాడు. కాల్పులు జరిపే పనిలో పడ్డాడు. అక్కడున్న జనం, కిరాయి ముఠా అందరూ భయంతో పరుగులు తీశారు. సినీ తరహాలో ఈ కాల్పులు సాగుతున్న సమయంలో, కుమార్ అనుచరులు ఎదురు దాడికి దిగడంతో తన నడుం భాగంలో దాచి పెట్టి ఉన్న మరో తుపాకీని తీసుకుని ఎమ్మెల్యే ఫైరింగ్ చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే చేతిలోని తుపాకీ నుంచి వచ్చిన తూటాలు కుమార్ కారు అద్దాలను చీల్చడం గమనార్హం. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడమే కాదు, అక్కడున్న నాలుగైదు వాహనాలను తగులబెట్టేశారు. చెంగోడులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు వచ్చిన సమాచారంతో చెంగల్పట్టు ఎస్పీ కన్నన్‌బృందం ఉరకలు తీసింది. అంతలోపు ఇరు వర్గాలు తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.
ఎమ్మెల్యే టార్గెట్
ఆ గ్రామంలో పరిస్థితిని సమీక్షించి, ఉద్రిక్తత మళ్లీ చోటు చేసుకోకుండా భద్రతా బలగాల్ని ఎస్పీ కన్నన్‌రంగంలోకి దించారు. అక్కడి నుంచి ఆయన తిరుప్పోరూర్ స్టేషన్‌కు వచ్చేలోపు ఇరు వర్గాలు జారుకున్నాయి. ఇరువర్గాలు ఫిర్యాదుల్ని పరిగణించిన ఎస్పీ, నలుగురు డీఎస్పీల నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే తూటా దెబ్బకు అటు వైపుగా వెళ్తున్న శ్రీనివాసన్ అనే వ్యక్తి గాయపడి ఉండడంతో కేసు మరింత బలంగా నమోదైంది. అదే సమయంలో శ్రీనివాసన్‌ను ఆసుపత్రి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో ఇది ఎమ్మెల్యే పనిగా భావించారు. ముందుగా డీఎంకే ఎమ్మెల్యేను అరెస్టు చేయడం కోసం అధికార పక్షం నుంచి ఒత్తిడి వచ్చినట్టుంది. వేట ముమ్మరంగానే సాగింది.
తనను పోలీసులు టార్గెట్ చేసిన సమాచారంతో తన తండ్రితో పాటుగా ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కాల్పులకు ఉపయోగించిన రెండు తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మరక్షణ కోసం ఎమ్మెల్యే తుపాకీ వాడుతున్నట్టు తేలింది. అయినా, ఆయన్ను పట్టుకోవడం లక్ష్యంగా రాత్రంతా వేట సాగగా, ఆదివారం ఉదయం చెన్నై శివారు మేడవాక్కంలో ఆయన ఉపయోగించిన కారును గుర్తించారు. స్వయంగా ఎస్పీ కన్నన్‌రంగంలోకి దిగడంతో చెన్నై చుట్టూ ఉన్న నిఘా నేత్రాల మీద దృష్టి పెట్టగా, ఎమ్మెల్యే తప్పించుకు వెళ్లిన మార్గాలు దొరికాయి. చెన్నై నుంచి చెంగల్పట్టు వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేసి తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌కు తరించారు.
తాను ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టుగా, తనకు లైసెన్స్ ఉందని ఇదయ వర్మన్ పేర్కొంటున్నారు. ఈ కేసులో సుమారు యాభై మందిని చేర్చారు. రియల్ యజమాని కుమార్, అతడి అనుచరుల కోసం కూడా వేట సాగుతోంది. డీఎంకే వర్గాల రూపంలో తుపాకీ సంస్కృతి మళ్లీ రాష్ట్రంలో తెర మీదకు వచ్చిందని మంత్రి జయకుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన తండ్రి ఇష్టానుసారంగా తుపాకీలతో జరిపిన కాల్పులకు సంబంధించి వీడియో ఆధారాలు ఉండబట్టే, పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment