ఆలంపాళయం గ్రామంలో శ్రీ మది ఇంటికి చేరుకున్న బంధువులు (ఇన్‌సెట్‌లో) శ్రీ మది (ఫైల్)
ఢిల్లీలో ఉన్నత చదువుల్ని అభ్యసిస్తున్న తమిళ విద్యార్థులకు భద్రత కరువవుతోంది. ఇటీవల విద్యార్థుల మరణాలు ఆందోళనను కల్గిస్తున్నాయి. ఏడాది కాలంలో రాష్ట్రానికి చెందిన శరవణన్, శరత్ ప్రభుతో పాటు మరికొందరు విద్యార్థుల బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ అనుమానాలకు దారితీసిన నేపథ్యంలో తాజాగా ఐఏఎస్ కావాలన్న ఆశతో ఢిల్లీలో అడుగుపెట్టిన తమిళ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చిన సమాచారం ఆ కుటుంబాన్ని ఆందోళనలో పడేసింది.
సాక్షి, చెన్నై : దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎయిమ్స్, అనుబంధ కళాశాలలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో అనేకమంది తమిళ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఎయిమ్స్‌లో వైద్య పీజీ ఎండీ విద్యార్థి శరవణన్ అనుమానాస్పద మరణం గతంలో కలకలం రేపింది. ఆ తదుపరి మరో విద్యార్థి, ఇలా వరుసగా అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో తమిళ విద్యార్థులకు భద్రత కల్పించా లన్న నినాదం మిన్నంటింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ లో ఐఏఎస్ కావాలని అకాడమీలో చదువుకుంటు న్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సమాచారం ఆ కుటుంబాన్ని కన్నీటి సాగరంలో ముంచింది.
చెదిరిన కల
ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని ఆలంపాళయం గ్రామానికి చెందిన రైతు తంగరాజ్, మహాదేవి దంపతులకు కుమార్తె శ్రీ మది (21), వరుణ్‌శ్రీ పిల్లలు. చిన్ననాటి చదువు శ్రీ మదికి అంటే ఎంతో ఇష్టం. సత్యమంగళంలో పదో తరగతి చదివిన శ్రీ మది, పబ్లిక్ పరీక్షల్లో 500 మార్కులకు గాను 493 సాధించారు. గోపిచెట్టిపాళయంలోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ పూర్తిచేసి 1200 మార్కులకు 1,103 మార్కులు పొందారు. కోయంబత్తూరులోని ప్రైవేటు కళాశాలలో బీఏ సోషియాలజీ చదువుకున్న శ్రీ మది ఐఏఎస్ కావాలన్న కలతో పరితపించింది. కుమార్తె కోరికను తీర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధం అయ్యారు. ఢిల్లీలో కరోల్ పార్క్‌లో ఉన్నవాజీరాం ఐఏఎస్ అకాడమీలో చేర్పించారు. వేలూరు జిల్లాకు చెందిన సహ విద్యార్థినితో పాటు ఓ గదిని అద్దెకు తీసుకుని శ్రీ మది శిక్షణ పొందుతూ వచ్చింది. ఈనేపథ్యంలో శ్రీ మది తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చిన సమాచారం తంగరాజ్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
శనివారం సాయంత్రం తమకు అందిన సమాచారంతో తంగరాజ్ కుటుంబీకులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. శ్రీ మది మృతి ఆ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. విషయం తెలిసి పెద్ద సంఖ్యలో వారి బంధువులు ఆలంపాళయం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బంధువులు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో చదువుకుంటున్న తమిళ విద్యార్థులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు ఏం జరిగిందో అనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతు చిక్కడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంగా విచారణ జరగాలని, తమిళ విద్యార్థుల భద్రత మీద రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీ మది మృతదేహాన్ని సోమవారం ఉదయం స్వగ్రామానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment