టీ.నగర్: తమిళనాడులో ఐఏఎస్ అధికారినంటూ 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసి పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నామక్కల్ జిల్లా, సేందమంగళం తూత్తికుళం గ్రామానికి చెందిన రాజు కుమారుడు గాంధీకన్నన్ (32). ఇతనికి తిరుచ్చి జిల్లా, తురైయూరు కామరాజర్‌నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలికతో గురువారం వివాహం జరిపేందుకు నిర్ణయించారు. శ్రీరంగంలోని ఒక ఆలయంలో వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వధూవరులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యమైనవారు మాత్రం గురువారం ఆలయానికి చేరుకున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న తిరుచ్చి జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి భువనేశ్వరి ఆలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే వివాహ తంతు ముగిసి వధూవరులు అక్కడి నుంచి వెళ్లినట్లు తెలిసింది. అధికారులు వధువు తల్లిదండ్రులను విచారించారు. వారు బాలికకు 19 ఏళ్లు పూర్తయినట్లు తెలిపారు. అనుమానంతో వధువు చదివిన పాఠశాలను ఫోన్‌లో సంప్రదించారు. దీంతో పాఠశాల యాజమాన్యం మార్కుల పదోతరగతి మార్కల లిస్టును అధికారులకు మెయిల్‌లో పంపింది. అందులో వధువుకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీంతో అధికారులు శ్రీరంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసులు నమోదు..
పోలీసులు వరుడు గాంధీకన్నన్, అతని తల్లి సరోజ, వధువు తల్లి జయంతి, బంధువు రాజకుమారిపై కేసు నమోదు చేశారు. జయంతిని పోలీసు స్టేషన్‌లో ఉంచి విచారణ జరుపుతున్నారు. అధికారి భువనేశ్వరి మాట్లాడుతూ వరుడు గాంధీకన్నన్ తిరువళ్లూరులో ఆర్‌డీఓగా ఉన్నట్లు వధువు తల్లిదండ్రులకు తెలిపాడన్నారు. వారి బంధువులకు మాత్రం చెన్నై సచివాలయంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నట్లు చెప్పాడన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. వధువుకు 19 ఏళ్లని వీఏఓ సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment