సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న కోపంతో టీడీపీ వర్గీయులు ఓ వ్యక్తిని వివస్త్రున్ని చేసి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మచిలీపట్నంలోని బలరాముని పేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బలరాముని పేటకు చెందిన తోకల లోకేష్ కుమార్ అనే వ్యక్తి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ వర్గీయులు అతడిపై దాష్టికానికి ఒడిగట్టారు. నడిరోడ్డుపై అతడిని వివస్త్రున్ని చేసి దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రింద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే రంగంలోకి దిగిన స్థానిక పెద్దలు టీడీపీ వర్గీయులను మందలించి రాజీ చేసి పంపేశారు. అయినా అంతటితో శాంతించని టీడీపీ వర్గీయులు పూటుగా మద్యం సేవించి లోకేష్ ఇంటి వద్ద వీరంగం సృష్టించారు. దీంతో భయపడిపోయిన లోకేష్ గతరాత్రి ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా బాధితుడు లోకేష్ ఓ మహిళను వేధిస్తున్నాడంటూ టీడీపీ వర్గీయులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆర్‌పేట సీఐ టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తమపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment