
రాజమహేంద్రవరం రూరల్ / కడియం : ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఆ బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించగా రంగంలోకి దిగింది. వరుస కథనాలతో చట్రం బిగించింది. తొలుత బుకాయింపులకు దిగిన ఆ అక్రమదారుడు చివరకు దిగిరాక తప్పలేదు. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకడుగు వేసిన పోలీసులు ఈ బాగోతాన్ని ‘సాక్షి’ ససాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. ఎట్టకేలకు నిందితుడు వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్‌లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం రాజమహేంద్రవరం తీసుకువచ్చారు.
అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని సంబంధిత అధికారులను నిలదీశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘటనా స్థలంలోనే ఆరు రోజులు నిరసన దీక్ష కూడా చేశారు. వెంకటాచలంపై అక్రమ క్వారీయింగ్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు. పోలీసు విచారణ నేపథ్యంలో వెలుగుబంటి వెంకటాచలం అజ్ఞాతంలోకి జారుకున్నారు. డీఎస్పీ పి. నారాయణరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం వెంకటాచలాన్ని కొడైకెనాల్‌లో అదుపులోకి తీసుకుని శనివారం రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. 7వ అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
పోలీసుల దాగుడుమూతలు
అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడిన నిందితుడు వెలుగుబంటి వెంకటాచలం అరెస్టుపై పోలీసులు దాగుడుమూతలాడారు. నాలుగు ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ. 8.61 కోట్ల అక్రమాలు చేసిన నిందితుడిని మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు నిందితుడిని తీసుకువచ్చారని తెలియడంతో పత్రికా విలేకరులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. చివరకు అక్కడినుంచి వెంకటాచలాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. కడియం, రూరల్ మండలాల నుంచి పలువురు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పైరవీలకు తెరదీశారు.
చిన్న,చిన్న దొంగతనాలు చేసిన నిందితులను విలేకర్ల సమావేశం పెట్టి మరీ హాజరుపరిచే పోలీసులు కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని రహస్యంగా కోర్టుకు తరలించడం విమర్శలకు తావిచ్చింది. వేమగిరి అక్రమ క్వారీయింగ్‌కు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల అండ ఉందని ఆందోళనకారులు చేస్తున్న ఆరోపణలు నిజం చేసే విధంగా శనివారం పోలీసులు వ్యవహరించారు.
నిందితుడికి రాచమర్యాదలు చేయడంతోపాటు, విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా తమ పని తాము పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తాలే చేతులు మారినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’గా తమ పరిస్థితి మారిందని ఓ పోలీసు ఉన్నతాధికారి విలేకర్ల ముందు వ్యాఖ్యానించారంటే పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఈ మేరకు ఉందో అర్థమవుతోంది.
సాక్షి కథనాలతో వెలుగులోకి..
- జనవరి 26న ‘వెలుగుబంటి విధ్వంసం’ శీర్షికతో అక్రమ క్వారీయింగ్‌ను తొలిసారిగా ‘సాక్షి’ జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో వెలుగులోకి తీసుకువచ్చింది.
- జనవరి 31న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని పరిశీలించి మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు.
- ఫిబ్రవరి 15న వేమగిరిలో జరిగిన అక్రమ క్వారీయింగ్‌లో జరిగిన నష్టాన్ని ‘ఆ తూట్లు విలువ రూ. 8.61 కోట్లు’ శీర్షికతో ‘సాక్షి’ మరో కథనాన్ని ప్రచురించింది.
- అనంతరం క్వారీయింగ్ కారణంగా నష్టపోతున్న కుటుంబాలు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment