అధికారం.. అదీ రాజకీయాధికారం ఉంటే చాలు.. ఏదైనా చేసేయొచ్చు!.. ఎంత పెద్ద కేసు నుంచైనా అనాయాసంగా బయటపడిపోవచ్చు!!..గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతలు సాగిస్తున్న దందాలు.. అధికార యంత్రాంగంపై చేస్తున్న స్వారీలు చూస్తే ఈ విషయంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనపించకమానదు..భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, ఇతరత్రా పలు రకాల దందాలతో చోటామోటా నేతలు సైతం బడాబాబులుగా రూపాంతరం చెందుతున్నారు.. కోట్లకు పడగలెత్తుతున్నారు..ఈ దుష్ట సంస్కృతికి కొనసాగింపే.. తాజాగా వెలుగులోకి వచ్చిన దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ చోటా టీడీపీ నేత అక్రమ దందా.. అదే దొంగ బంగారం కొనుగోలు దందా..వృత్తి కార్మికునిగా జీవితం ప్రారంభించిన ఈ టీడీపీ నేత..
తొలి నుంచీ ఈ వ్యవహారాల్లోనే రాటుదేలాడు.. కోట్లు కూడబెట్టాడు..ఇక టీడీపీ అధికారంలోకి రావడం.. స్థానిక ఎమ్మెల్యే దన్ను దొరకడం, చిన్నపాటి నామినేటెడ్ పోస్టు కూడా లభించడంతో మరింత రెచ్చిపోయి చోరీ బంగారం కొనుగోళ్ల మోతాదు పెంచాడు..అయితే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయడంతో పెద్దమొత్తంలో దొంగ బంగారంతో అడ్డంగా దొరికిపోయాడు..అయితే ఏం.. అధికారం ఉంది కదా.. ఇలా ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లడం.. అలా అక్కడి ఫోన్ మోగడం.. ఎమ్మెల్యేగారి అధికార స్వరం వినిపించడంతో.. దాడుల వరకు పక్కాగా జరిపిన పోలీసులు నీరుగారిపోయారు.. అయ్యగారిని వదిలేసి.. కేసును సాగదీస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూకబ్జాలు, దందాలు, సెటిల్‌మెంట్లతో ఇప్పటికే నగరాన్ని చెరబట్టిన టీడీపీ నేతలు.. తమ దందాల్లో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. దొంగ బంగారం కొనుగోళ్లు, విక్రయాల కేసుల్లోనూ తమదే పైచేయి అని నిరూపించుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం వార్డు అధ్యక్షుడిగా, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుడిగా హల్‌చల్ చేస్తున్న ఓ నగల వ్యాపారి దొంగ బంగారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అయితే అధికారం అండతో వెంటనే బయటకొచ్చేశాడు. వాస్తానికి దొంగ బంగారం కొనుగోలు, విక్రయాల్లో ఎప్పటి నుంచో ఆరితేరిన వ్యాపారిగా పేరున్న ఈయన ఇప్పటికే చాలాసార్లు పోలీసు రికార్డులకెæక్కాడు.
తాజాగా మూడురోజుల కిందట కంచరపాలెం పోలీసులు పక్కా సమాచారంతో కురుపాం మార్కెట్ సమీపంలోని సదరు టీడీపీ నేతకు చెందిన జ్యూయలరీ షాపుపై దాడి చేశారు. అక్కడ అరకేజీకి పైగా దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకుని షాపును మూయించేశారు. సదరు వ్యాపారి కమ్ నేతను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఓ న్యాయవాది మధ్యవర్తిత్వంలో ఓ దొంగ నుంచి ఆ బంగారం కొనుగోలు చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు ఆ మేరకు కేసు ఫైల్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈలోగా టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి.. ఒత్తిడి చేయడంతో, అతన్ని విడిచిపెట్టి.. ప్రస్తుతానికి విచారణను కొనసా...గిస్తున్నారు.
గతమంతా నేర చరిత్రే
వాస్తవానికి ప్రస్తుతం పట్టుబడిన వ్యాపారికిది మొదటి కేసేమీ కాదు. ఆయన గత చరిత్రంగా కేసులమయమే, 1991లోనే దొంగ బంగారం కేసుల్లో ఆయనపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత రాజకీయ నేతగా రూపాంతరం చెందాక సస్పెక్ట్ షీట్‌ను తీయించేసుకున్నప్పటికీ.. అతని వ్యాపారశైలి మాత్రం మారలేదు. మూడేళ్ల కిందట ఇదే వ్యాపారి అలియాస్ టీడీపీ నేతను నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పరదేశిపాలెం సర్వే నెంబర్–2లో 5.26 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. సదరు టీడీపీ నేత ఫోర్జరీ పత్రాలతో ఆ భూములకే టైటిల్ డీడ్, పట్టా చేయించేసుకున్నాడు. దీనిపై స్వయంగా ఇప్పటి జిల్లా కలెక్టర్, అప్పటి జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు 420, 468 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఇక 2007లో సహచర జ్యూయలరీ వ్యాపారులు పల్లా సత్తిబాబు, కొలుసు అప్పలరాజులను బంగారం రికవరీ విషయంలో ఇబ్బంది పెట్టడంతో వారు అప్పట్లో హోంమంత్రి మొదలుకుని అందరికీ ఫిర్యాదుచేశారు.
విచారణ జరుపుతున్నాం: ఎస్‌ఐ కుమార్
దొంగ బంగారం కొనుగోలు చేశారని వచ్చిన సమాచారంతో టీడీపీ వార్డు అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ నాయకుడిని అదుపులోకి తీసుకుని విచారించామనికంచరపాలెం క్రైం ఎస్సై కుమార్ తెలిపారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ అతన్ని అదుపులోకి తీసుకున్నా ఇంకా బంగారం రికవరీ చేయలేదని, కేసు విచారణ దశలో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment