
సాక్షి, చింతపల్లి: ఉపాధ్యాయులతో వెళ్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి వద్ద జరిగింది. సాగర్ రహదారిపై చింతపల్లి మండలం గొల్లపల్లి వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వ్యాగన్ ఆర్ కారు ట్రాక్టరును బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో శ్రీరాం రమేష్(40) అనే ఉపాధ్యాయుడు మృతిచెందాడు. మరో ముగ్గురు సుమలత, సుమతి, రాధారాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరు హైదరాబాద్ నుంచి చింతపల్లికి వస్తున్నారు. రమేష్ చింతపల్లి సమీపంలోని బోజ్యా తండాలో పనిచేస్తున్నారు. కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.