భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న శ్రీదేవి
వైఎస్‌ఆర్ జిల్లా , గుర్రంకొండ/గాలివీడు : వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే ఓ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం అరవీడు గాండ్లపల్లెకు చెందిన వి.కృష్ణకుమార్‌కు(42) మండలంలోని తరిగొండ వాసి శ్రీదేవితో వివాహమైంది. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2008 డీఎస్సీలో వైఎస్సార్ జిల్లాలో టీచర్ పోస్టుకు ఎంపికై ఏడేళ్లపాటు అక్కడే పనిచేసి నాలుగేళ్ల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి బదిలీపై వచ్చారు.
ఈ నేపథ్యంలో వేసవి సెలవులకు అత్తగారిల్లైన తరిగొండకు కొన్నిరోజుల క్రితం వచ్చాడు. సోమవారం ఉదయం 6.30గంటలకు ఇంటి నుంచి వాకింగ్‌కు బయల్దేరాడు. తరిగొండ–వాల్మీకిపురం మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు పక్కన నడచుకుంటూ వెళుతుండగా గుర్రంకొండ నుంచి వాల్మీకిపురం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి ఢీకొంది. ప్రమాదంలో కృష్ణకుమార్ అక్కడిక్కకడే మృతి చెందాడు. సెలవులకని వచ్చి తనువు చాలించావా?అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఎస్‌ఐ లోకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment