చోరీ చేసి పారిపోతుండగా సీసీ కెమెరాకు చిక్కిన జంట(ఫైల్)
వారిద్దరు భార్యాభర్తలు. భర్త లారీడ్రైవర్.. జల్సాలు చేసి అప్పులపాలయ్యాడు. ఈజీగా మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు.. ఇందుకు భార్య సహకరించడంతో అతడి పని మరింత సులువయ్యింది.. ఇద్దరూ కలిసి ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు చేస్తూ ఆభరణాలను అపహరించడం మొదలు పెట్టారు. వాటిని విక్రయించి ఎంజాయ్ చేసేవారు. దొంగతనాల్లో ఎంతగా ఆరితేరినా.. ఆధునిక నిఘావ్యవస్థకు చిక్కి కటకటాలపాలయ్యారు.
సాక్షి, కామారెడ్డి : మాచారెడ్డి మండలం సోమార్‌పేటకు చెందిన భూక్య తిరుపతి (25), భూక్య రజిత (21) భార్యాభర్తలు. తిరుపతి లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు.. జల్సాలకు అలవాటుపడిన తిరుపతి.. అప్పుల పాలయ్యాడు. పనిచేయలేక.. జల్సాలను మానలేక.. సులువుగా డబ్బు సంపాదించడానికి ఈజీ మార్గాన్ని వెతుక్కున్నాడు. చోరీలు మొదలుపెట్టాడు.
ఇందుకు భార్య అడ్డుచెప్పలేదు సరికదా.. ప్రోత్సహించింది. మొదట తిరుపతి ఒక్కడే దొంగతనాలు చేసేవాడు. అపహరించిన ఆభరణాలను తెచ్చి భార్యకు ఇచ్చేవాడు. వాటిని తర్వాత అమ్మి ఇద్దరూ ఎంజాయ్ చేసేవారు. ఆ తర్వాత భార్య కూడా చోరీలలో భాగస్వామిగా మారింది.
ఖరీదైన బైక్‌పై..
భార్యాభర్తలిద్దరు ఖరీదైన బైకుపై ఎవరికీ అనుమానం రాకుండా పట్టపగలే దొంగతనాలకు బయలుదేరుతారు. పంట చేను వద్దో, రోడ్డుపైనో ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. ఇద్దరూ కలిసి ఆ మహిళ వద్దకు వెళ్లి మాటలు కలుపుతారు. తరువాత దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని పూర్తిగా దోచుకుని పారిపోతారు. ఇలా ఎత్తుకొచ్చిన సొత్తును అమ్ముకుని జల్సాలు చేస్తారు.
సీసీ కెమెరాల్లో చిక్కి....
ఇటీవల భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామ శివారులో పంట చేను వద్ద మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ జంట టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరాకు చిక్కింది. అలాగే దోమకొండ మండలం ముత్యంపేట శివారులో ఓ మహిళపై దాడి చేసి ఆభరణాలను దోచుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట వద్ద మహిళ మెడలో నుంచి ఆభరణాలను దోచుకున్నారు.
ఇటీవల రామారెడ్డి మండలంతో పాటు మాచారెడ్డి మండలంలో జరిగిన రెండు చోరీ కేసుల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. నిందితుడు తిరుపతిపై నిఘావేసి భార్యాభర్తలను పట్టుకున్నారు. వీరికి సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
నెలకో చోరీ....
ఏడాదిలో 12 చోరీలు చేసిన వీరు సుమారుగా రూ.8 లక్షల విలువైన సొత్తు అపహరించారు. వీరు కామారెడ్డి జిల్లాలోనే కాక సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ చోరీలకు పాల్పడినట్టు ఇప్పటి వరకు పోలీసుల విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన సొత్తును అమ్ముకుని జల్సా చేసేవారని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన సొమ్ముతో ఎంజాయ్ చేసిన ఈ జంట.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
ఇప్పటి వరకు తిరుపతి 12 దోపిడీ కేసుల్లో పాల్గొనగా, మూడింటిలో ఆయన భార్య రజిత కూడా పాల్గొందని ఎస్పీ శ్వేత తెలిపారు. ఐదు దోపిడీ కేసులు, ఐదు చైన్‌స్నాచింగ్‌లు, బైక్ చోరీ, ఇంటి దొంగతనం వంటి కేసుల్లో నిందితులైన భార్యాభర్తలను అరెస్టు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment