సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి జంక్షన్.. సోమవారం ఉదయం 6.30 గంటలు.. వీకెండ్‌లో బెంగళూరులోని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిండు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతనితో పాటు స్నేహితుడు కూడా బెంగళూరు వెళ్లి వచ్చాడు. ఇద్దరూ రోడ్డు దాటుతుండగా వీరి కోసం ఇద్దరు ఆటోడ్రైవర్లు వచ్చారు. అకస్మాత్తుగా ఓ సిటీ బస్సు వీరిపైకి మృత్యువులా దూసుకొచ్చింది. బస్ బేలో నిలుచున్న వీళ్లను గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జనార్ధన్ శివాజీ(35), ఆటోడ్రైవర్ దశరథ్(45), అబ్దుల్ హమీద్(53) అక్కడికక్కడే మృతి చెందారు. జనార్ధన్ స్నేహితుడు వికాస్ ప్రతాప్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద వివరాలను రాయదుర్గం సీఐ రాంబాబు మీడియాకు వెల్లడించారు. నగరంలోని క్యాప్ జెమినీలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెందిన జనార్థన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ ప్రతాప్ సింగ్‌లు ఇద్దరు స్నేహితులు.
అమెరికాలో ఉన్న వీరు 10 రోజుల క్రితమే బదిలీపై హైదరాబాద్‌కు వచ్చారు. వీకెండ్ సెలవులకు బెంగళూర్ వెళ్లారు. ఆదివారం రాత్రి ఇద్దరూ హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో రాయదుర్గం వైపు వెళ్లే బస్ స్టాప్‌కు నడుచుకుంటూ వస్తున్నారు. వీరి కోసం నానక్‌రాంగూడకు చెందిన బత్తుల దశరథ్ , పాతబస్తీ నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన అబ్ధుల్ హమీద్ ఆటోడ్రైవర్లు వెళ్లారు. అదే సమయంలో లింగంపల్లి నుంచి కోఠికి వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు (ఏపీ11జడ్6172) వేగంగా బస్టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇరువైపుల నుంచి వచ్చిన ఈ నలుగురిని ఢీకొట్టింది. జనార్ధన్ తలపై నుంచి చక్రం వెళ్లడంతో తల చిద్రమైంది. బస్సు చక్రం వద్ద ఇరుక్కుని ఆటోడ్రైవర్లు అక్కడిక్కడే మృతి చెందారు. వికాస్ ప్రతాప్ బయటి వైపు పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే అతన్ని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ జహంగీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశరథ్‌కు భార్య ఉషారాణి, కూతురు ప్రణవి, కొడుకు ధనుష్ ఉన్నారు. అబ్దుల్ హమీద్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారు. కుటుంబానికి అతడే ఆధారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జ్ఞాపకాల తడి ఆరకుండానే.....
జనార్ధన్ తాను పని చేస్తున్న కంపెనీ విధుల్లో భాగంగానే ఇటీవల వరకు అమెరికాలో ఉండి వచ్చాడు. అతనికి భార్య సుకన్య, కూతురు తనిష్క (7), 7 నెలల కొడుకు సాయి దివిజ్ ఉన్నారు. భర్త అమెరికాలో ఉండటంతో సుకన్య మధురైలోని పుట్టింటికి వెళ్లి అక్కడే సాయికి జన్మనిచ్చింది. జనార్ధన్‌కు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆమె పిల్లలను తీసుకొని బెంగళూర్‌లోని అత్తారింటికి వచ్చింది. వీకెండ్‌లో భార్యాపిల్లలు, అమ్మానాన్నలతో జనార్ధన్ సంతోషంగా గడిపాడు. ఆ జ్ఞాపకాలతోనే ఆదివారం బస్సెక్కాడు. కానీ ఆ జ్ఞాపకాల తడి ఆరకుండానే మృత్యువు రూపంలో బస్సు బలి కబలించింది.
జహంగీర్ నిర్లక్ష్యమే కొంప ముంచింది...
వేగాన్ని తగ్గించకుండా డ్రైవర్ జహంగీర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని, దీంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని సీఐ రాంబాబు అభిప్రాయపడ్డారు. డ్రైవర్ బ్రేక్ వేసినా, నెమ్మది నడిపినా ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదన్నారు. బస్ బే వైపు వస్తున్న వారిని గమనించకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 2013లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరిన జహంగీర్ అదే ఏడాది జూబ్లీహిల్స్‌లో ఓ మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. అప్పుడు ఉద్యోగం నుంచి తొలగించగా, మెర్సీ పిటిషన్‌పై మళ్లీ విధుల్లో చేరాడు.
ఒక్కసారిగా మీదికి దూసుకొచ్చింది: వికాస్
‘‘వేగంగా వచ్చిన బస్సు స్టాప్‌లో ఆగుతుందని అనుకున్నాం. బస్‌బే దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో జనార్ధన్ ముందు టైర్ కింద పడిపోయాడు. నేను పక్కకు పడ్డాను. వెంటనే డ్రైవర్ బస్సును ఎడమ వైపునకు కట్ చేయడంతో మా కోసం వస్తున్న ఆటోడ్రైవర్లు కూడా బస్సు కిందికి వెళ్లిపోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
అడ్డదిడ్డంగా బస్‌బేలు: విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
సైబరాబాద్ పరిధిలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్ ట్రాఫిక్ పోలీసులతో ఎలాంటి సమన్వయం లేకుండా బస్‌బేలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్వర్‌టైజ్ ఏజెన్సీల కోసం ఎక్కడపడితే అక్కడ బస్‌బేలు నిర్మిస్తున్నారు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. జంక్షన్లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించాం’’అని చెప్పారు. ప్రమాద స్థలంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న విద్యుత్ బిల్లుల కౌంటర్ డబ్బాను సీజ్ చేయాలని గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నర్సింగ్‌రావును ఆదేశించడంతో అక్రమణలను తొలగించారు. ఇదిలా ఉండగా గచ్చిబౌలిలోని మెహిదీపట్నం వైపు వెళ్లే బస్ స్టాప్ మూలమలుపు వద్దే ఉండటంతో ప్రమాదకరంగా మారింది. బస్ స్టాప్‌ను ముందుకు తరలిస్తే బాగుటుందని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment