ముగ్గురు నైజీరియన్ల ఘరానా మోసం! | Three Nigerians Arrested For Fraud | Sakshi
Sakshi News home page

ఉద్యోగమన్నారు..లక్షలు కాజేశారు..

Published Sun, Oct 13 2019 5:06 AM | Last Updated on Sun, Oct 13 2019 9:07 AM

Three Nigerians Arrested For Fraud - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు హీదర్‌  విలియమ్స్, దియోంగ్యూ, ముసా, హాలిటో

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొల్లగొడుతున్న ఓ ముగ్గురు నైజీరియన్లతో పాటు నాగాలాండ్‌ మహిళను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్లు దియోంగ్యూ మహమ్మద్, ముసా హలిమాట్, ఎన్‌డౌర్‌ అలియోనితో పాటు నాగాలాండ్‌కు చెందిన హలిటో జిమోమీని న్యూఢిల్లీ నుంచి ట్రాన్సిట్‌ వారంట్‌పై శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కేసు వివరాలను క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌లతో కలసి సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.

నేరగాళ్ల పాత్రలిలా.. 
న్వోసు డొనాల్డ్‌ ప్రాస్పర్‌ అలియాస్‌ దియోంగ్యూ మహమ్మద్‌ అలియాస్‌ హీదర్‌ విలియమ్స్‌గా చలామణి అవుతున్నాడు. నైజీరియాకు చెందిన న్వోసు డొనాల్డ్‌ ప్రాస్పర్‌ పేరును దియోంగ్యూ మహమ్మద్‌గా మార్చుకొని సింగపూర్‌ పాస్‌పోర్టుపై 2018 మార్చిలో టూరిస్ట్‌ వీసాపై భారత్‌కు వచ్చాడు. విదేశాల్లో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి జాబితాను సేకరించి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మెయిల్స్‌ పంపేవాడు. ముసా హలిమాట్‌ అలియాస్‌ మిస్‌ హీదర్‌ విలియమ్స్‌ దియోంగ్యూ ప్రియురాలు. మెడికల్‌ వీసాపై 2016లో భారత్‌కు వచ్చింది.

ఉద్యోగార్థులతో మాట్లాడుతూ వారిని ముగ్గులోకి లాగడం ఈమె పని. ఎన్‌డౌర్‌ అలి యోని అలిమాస్‌ బెనిడిక్ట్‌ ఎనబులిలి అలియాస్‌ మిస్టర్‌ రాబర్ట్‌ సెనగల్‌ పాస్‌పోర్టుపై 2018 సెప్టెంబర్‌లో టూరిస్ట్‌ వీసాపై భారత్‌కు వచ్చాడు. వివిధ కంపెనీల నకిలీ ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించడంలో దిట్ట. నాగాలాండ్‌కు చెందిన హలిటో జిమోమి అలియాస్‌ అకిత కుమారి 2019లో నైజీరియాకు చెందిన ఫ్రాన్సిస్‌ అగాహోన్‌ను పెళ్లాడింది. అకిత కుమారి పేరుతో మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చేస్తుంది. పెటోసైల్‌ ఉఘా, శామ్సన్‌ విలియమ్‌లు కూడా దియోంగ్యూకు సహకరించేవారు.

గుట్టు రట్టయిందిలా.. 
కూకట్‌పల్లికి చెందిన వి.రాజన్‌బాబు భారత ప్రభుత్వ అటామిక్‌ ఎనర్జీ విభాగంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గత మూడేళ్లుగా ఒడిశాలోని పట్నాయక్‌ స్టీల్స్‌లో సీఈవోగా పనిచేస్తున్నారు. అక్కడ ఏడాదికి రూ.45 లక్షలు జీతం తీసుకుంటున్నారు. ఎక్కువ జీతం వచ్చే జాబ్‌ కోసం రాజన్‌ చేస్తున్న ప్రయత్నాలను నైజీరియన్‌ బ్యాచ్‌ గుర్తించింది. లాస్‌ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా రొగల్‌ హోటల్‌ అండ్‌ అపార్ట్‌మెంట్స్‌ సీఈవో అంటూ హీదర్‌ విలియమ్స్‌ రాజన్‌కు ఫోన్‌ చేశాడు. ఏడాదికి కోటిన్నర ఇస్తామని చెప్పారు. బోస్టన్‌ నుంచి ఢిల్లీలోని బ్రిటిష్‌ కాన్సులేట్‌కు వస్తున్నానని రాజన్‌ను నమ్మించారు. హీదర్‌ విలియమ్స్‌ 12 నెలల అడ్వాన్స్‌ శాలరీ 1.75 లక్షల డాలర్ల డీడీతో వచ్చిందని, ఇది విడుదల చేయాలంటే రూ.55 వేలు చెల్లించాలని అకిత కుమారి మాట్లాడింది.

మళ్లీ ఫోన్‌ చేసి రూ.2.55 లక్షలు చెల్లించాలని అడగడంతో మళ్లీ అంత మొత్తాన్ని జమ చేశారు. ఆ వెంటనే హీదర్‌ విలియమ్స్‌ ఫోన్‌ చేసి మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ అడగడంతో మళ్లీ ఖాతాలో వేశాడు. ఇలా పలు దఫాలుగా రూ.47 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. వారం అయినా నిందితుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆగస్టు 29న ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు కేసు ఛేదించారు. నిందితుల నుంచి 21 సెల్‌ఫోన్లు, నాలుగు పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, డెబిట్‌కార్డులు, విదేశీ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషిం చిన ఇన్‌స్పెక్టర్లు కె.శ్రీనివాస్, సీహెచ్‌ రామయ్య, ఎస్‌ఐలు విజయ్‌ వర్ధన్, రాజేంద్రను సీపీ సజ్జనార్‌ సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement