రాజ్‌కోట్ : కన్నపేగును ఓ కొడుకు కాలయముడై కడతేర్చాడు. కీలక సాక్ష్యాన్ని పోలీసులు స‍్వాధీనం చేసుకోవటంతో ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపాడు. దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఇటీవల జయశ్రీ అనే వృద్ధురాలు తాను నివసిస్తున్న భవనం పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు తర్వాత దర్యాప్తులో విస్మయం కలిగించే విషయం వెలుగు చూసింది.
రాజ్‌కోట్‌లోని ఓ ఫార్మసీ కాలేజీలో సందీప్ నతవానీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి చనిపోగా.. తల్లి జయశ్రీ అతని వద్దే ఉంటున్నారు. జయశ్రీకి ఇద్దరు కూతుళ్లు.. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి కూడా. గత కొంత కాలంగా ఆమె ఆరోగ్యం బాగోటం లేదు. ఈ క్రమంలో హఠాత్తుగా ఆమె మేడ మీద నుంచి పడి చనిపోవటం పలు అనుమానాలకు తావునిచ్చింది. సందీప్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముందు ప్రమాదవశాత్తూ పడిపోయిందని కేసు నమోదు చేసుకున్నారు.
అయితే ఈ మధ్యే జయశ్రీకి పక్షవాతం కూడా సోకిందని.. సరిగ్గా కదల్లేని ఉన్న ఆమె మేడ మీదకు ఎలా వెళ్లగలిగిందంటూ బంధువుల అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పోలీసులను ఆశ్రయించటంతో కేసును లోతుగా దర్యాప్తు జరిగింది. చివరకు అపార్ట్ మెంట్ లోని సీసీ పుటేజీల ద్వారా అసలు విషయాన్ని తేల్చేశారు.
సపర్యల కారణంగానే...
తల్లికి సపర్యలు చేసే విషయంలో కొంతకాలంగా సందీప్, అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరకు భార్య బలవంతం మేరకు కొడుకు తన తల్లిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 27న తల్లిని డాబా మీదకి తీసుకెళ్లి తోసేశాడు. ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య చిన్నపాటి సంభాషణే జరగగా.. ఆ దృశ్యాలు కూడా గమనించవచ్చు. తల్లిని మెల్లిగా పైకి తీసుకెళ్లిన సందీప్.. ఘటన తర్వాత మళ్లీ ఏమీ తెలియని వాడిలా వచ్చి తలుపేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌లో నివసించే మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి జయశ్రీ పడిపోయిన విషయాన్ని వివరించగా.. ఏమీ తెలియని వాడిలా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయని పోలీసులు వెల్లడించారు.
నేను అమాయకుణ్ణి : సందీప్
ఘటన తర్వాత ఆరోపణలు రావటంతో వాటిని ఖండించిన సందీప్ ఛాతీలో నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరాడు. మేడ మీదకు తీసుకెళ్లాలని తనను తల్లి కోరిందని.. తిరిగి నీటి కోసం తాను కిందకు వచ్చేసరికి ఘటన జరిగిందంటూ అతను చెబుతున్నాడు. అతను డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకుంటామని.. త్వరలో కేసు చిక్కుముడి విప్పదీస్తామని రాజ్‌కోట్ పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment