సాక్షి, తిరుపతి క్రైం : మహిళను మోసం చేసి సినీ ఫక్కీలో ఆమె నగలను చోరీ చేసిన సంఘటన నగరంలోని దొడ్డాపురం వీధిలో సోమవారం చోటుచేసుకుంది. ఈస్టు ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా వివరాల మేరకు.. దొడ్డాపురంలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ధనలక్ష్మి భర్త మృతి చెందడంతో కుమారుల వద్దే ఉంటోంది. రోజులాగా సోమవారం వాకింగ్‌కు వెళ్లింది. తిరుగుప్రయా ణంలో కూరగాయలు కొనేందుకు వెళుతుండగా ఆమె ముందు ఓ పర్సు పడి వుంది. ఆమె ఆ పర్సును తీసుకుంంటుండగా.. తాను కూడా పర్సును చూశానని, తనకూ భాగం ఇవ్వాలంటూ మరో మహిళ వాగ్వాదానికి దిగింది. ఇదంతా ఎందుకని, ఇద్దరూ కలిసి పంచుకునేందుకు ఓ చోట కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడకు ఒక వ్యక్తి తన పర్సు పోయిందంటూ రాగా, ఆ ఇద్దరు మహిళలు పర్సును దాచారు. తన పర్సు ఎక్కువ నగలు వేసుకున్న మహిళ తీసుకుందని ఎవరో చెప్పినట్లు సదరు వ్యక్తి చెప్పగా.. ఆ మహిళలు తాము కాదని, అక్కడ చాలా మంది ఉన్నారని దబాయించారు. మీరు ఇక్కడే ఉంటే నేను వెళ్లి కనుక్కొని వస్తానంటూ సదరు వ్యక్తి వెళ్లిపోయాడు.
నగలను చూసి మనమే అనుకుంటున్నాడని, ఆ నగలను పర్సులో పెట్టి దాచిపెడదామంటూ ధనలక్ష్మీతో పాటు ఉన్న మహిళ సలహా ఇచ్చింది. దాంతో ధనలక్ష్మి తన నగలను పర్సులో పెట్టింది. తిరిగి వచ్చిన సదరు వ్యక్తి ధనలక్ష్మి కొంగుచాటున దాచిన పర్సును చూసి.. అదే తన పర్సని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ నగల పర్సును లాక్కుని ఉడాయించాడు. ఆమెతో ఉన్న మహిళ కూడా అతన్ని పట్టుకునేందుకు వెళ్లినట్టుగా వెళ్లి మెల్లగా జారుకుంది. పోలీసులను పెడదారి పట్టించిన బాధితురాలు.. బాధితురాలు జరిగిందంతా దాచిపెట్టి తప్పుడు సమాచారంతో పోలీసులను పెడదారి పట్టించిందని ఎస్‌ఐ తెలిపారు. తనను ఎవరో కత్తులతో బెదిరించి 104 గ్రాముల చైన్, 4గాజులు, ఉంగరాన్ని దోచుకెళ్లారని ఫిర్యాదు చేసిందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం తెలిసిందన్నారు. జరిగిన సంఘటన తెలిస్తే ఎవరైనా ఏమైనా అంటరేమోనని ఇలా పోలీసులను పక్కదారి పట్టించిందన్నారు. చోరీ కేసుతో పాటు చీటింగ్ కేసు కూడా నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment