సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో కొందరు ‘సోషల్ మీడియా’గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలో, మరెవరో అన్న దానిపై స్పష్టత లేదుగానీ.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా ‘మైండ్ గేమ్’ఆడుతున్నారు. కొద్దిరోజుల కింద రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రాబబుల్స్ జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడితే.. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీటర్ ఖాతా పేరిట పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి కలకలం సృష్టించారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
మొన్న జాబితా.. నేడు ఫిరాయింపు
సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న కొందరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. గత సోమవారం వాట్సాప్‌లో రెండు పేజీలతో కూడిన ఓ జాబితా వైరల్ అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాబబుల్స్ అంటూ 60 అసెంబ్లీ స్థానాలకు 66 మంది పేర్లను ఆ జాబితాలో పెట్టారు. ఇందులో చనిపోయిన వారి పేర్లు, కనీసం పరిగణనలో కూడా లేని పేర్లు ఉన్నాయి. అయినా ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. నాయకుల్లో కంగారు మొదలైంది. దీంతో ఆ జాబితాకు, పార్టీకి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ హడావుడి ముగిసిందో లేదో మరో వివాదాస్పద పోస్టు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం నడుస్తోందంటూ.. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌కుమార్ పేరిట ట్వీటర్‌లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రెడ్ల ఆధిపత్యంలో ఇమడలేక పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా..’’అని ఆ పోస్టులో ఉండడంతో.. శ్రవణ్ నిర్ఘాంతపోయారు. తనకు సంబంధం లేకుండా, తన పేరిట ట్వీటర్‌లో చేసిన ఈ పోస్టింగ్‌పై ఆయన పోలీసులను ఆశ్రయించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌తో కలసి సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొత్తంగా వరుసగా జరుగుతున్న ‘సోషల్ మీడియా’దాడులతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీఆర్‌ఎస్ హస్తముందంటున్న కాంగ్రెస్
అయితే వివాదాస్పద పోస్టింగుల వెనుక అధికార టీఆర్‌ఎస్ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కుట్ర రాజకీయాలు చేస్తూ తప్పు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ ఈ నకిలీ జాబితాలు, పోస్టింగుల వెనుక ఎవరున్నారనేది పోలీసులే తేల్చాల్సి ఉంది.
టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు: శ్రవణ్
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన దాసోజు శ్రవణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడే ఎదుగుతున్న బీసీ నాయకుడినైన తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జయశంకర్ అడుగు జాడల్లో, మారోజు వీరన్న సిద్ధాంతాలతో ముందుకు వెళుతున్న తన ఉద్యమ స్ఫూర్తిని ఈ చిల్లర ప్రచారాలు ఆపలేవన్నారు. ఇలాంటి తప్పుడు విధానాలకు తెలంగాణ సమాజం పట్టం కట్టదన్న విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు గ్రహించాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment