ట్రావెల్స్‌ బస్సులు ఢీ | Travel Bus Accident In Guntur Highway | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సులు ఢీ

Published Wed, Aug 8 2018 1:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Travel Bus Accident In Guntur Highway - Sakshi

ప్రమాదంలో ముందు భాగం నుజ్జునుజ్జు అయిన ఎల్‌వీఆర్‌ ట్రావెల్స్‌ బస్సు

జగ్గయ్యపేటలోని 65వ నంబర్‌ జాతీయ రహదారిపై గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్‌ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్‌ పక్క సీట్లో నిద్రిస్తున్న హాల్టింగ్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మూడు బస్సుల్లోని 25 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా అమలాపురం, వైజాగ్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది.

గరికపాడు (జగ్గయ్యపేట) : 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై మండలంలోని ఆర్టీఏ గరికపాడు చెక్‌పోస్టు వద్ద మూడు ట్రావెల్స్‌ బస్సులు ఒకదానినొకటి ఢీకొనటమే కాకుండా వెనుక బస్సును మరో కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీ 28 టీడీ 4444 నంబర్‌ గల ఎల్‌వీఆర్‌ ట్రావెల్స్‌ బస్సు 30 మంది ప్రయాణికులతో విశాఖపట్నం బయలుదేరింది. మూడు గంటల సమయానికి ఏపీ, తెలంగాణ సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్దకు వచ్చే సరికి ఎదురుగా ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావటంతో బస్సు డ్రైవర్‌ డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలోనే వెనుక వస్తున్న ఏఆర్‌ 01 జీ 6939 నంబర్‌ గల జైభారత్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సు వేగంగా వచ్చి ముందున్న ఎల్‌వీఆర్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కళ్లు తెరిచేసరికి జై భారత్‌ బస్సును కావేరి ట్రావెల్స్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అదే సమయంలో ఈ మూడు బస్సులను వాటి వెనుక వస్తున్న మరో కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో జైభారత్‌ బస్సులోని డ్రైవర్‌ పక్క సీట్లో నిద్రిస్తున్న హాల్టింగ్‌ డ్రైవర్‌ వాసంశెట్టి శ్రీనివాసరావు (34) ఛాతీ భాగంలో బలమైన దెబ్బ తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్న అమలాపురం, వైజాగ్, విజయవాడ ప్రాంతాలకు చెందిన పురుగు శ్రీనివాసరావు, తాడాల వెంకన్న, చంద్రపాడు నాగేశ్వరరావు, గుట్టపాటి మనోహర్‌ శాస్త్రి, శోభానాథ్‌ కామేశ్వరరావు, వడ్ల వీర శంకరాచారి, మార్గం వెన్నెల, జిక్కుల శ్రీధర్, చంద్రశేఖర్, పిల్లాల నగేష్, మహ్మద్‌ ఇజ్రాయిల్, చిత్ర అజయ్, కోటిపల్లి వీరాంజనేయులు, వెగిశాల వెంకట రమణ, వెంకటేశ్వరరావు, గొట్టిపాటి సుబ్బలక్ష్మి, గుడేటి రామలింగేశ్వరరావు, నల్లబెల్లి హరివెంకన్నరెడ్డి, గొట్టెంపాటి చందన, గుత్తి మంగతాయారు, కొప్పర విశ్వ, మహ్మద్‌ అహ్మద్, బందరుపాటి భారతి, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌లకు తలకు, వెన్నెముక, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావటంతో ప్రమాద సమయంలో ఉన్న పోలీస్, హైవే సిబ్బంది 108 వాహనాల ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎక్కువగా కావేరి, జై భారత్‌ బస్సుల్లో ప్రయాణించిన వారే ఉన్నారు. స్వల్ప గాయాలైన వారిని పోలీసులు మరో బస్సులో వారి ప్రాంతాలకు తరలించారు. ప్రమాదంలో ముందు రెండు బస్సులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. స్లీపర్‌ కోచ్‌లు కావటంతో బస్సులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు.

ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు..
అర్థరాత్రి సమయంలో క్షతగాత్రులను అంబులెన్స్‌లు, ప్రత్యేక వాహనాల ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకురావటంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆస్పత్రికి దశల వారీగా క్షతగాత్రులను తీసుకురావటంతో బెడ్‌లు లేక మంచాలు, నేలపై పడుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా విధుల్లో వైద్యురాలు శారద ఒక్కరే ఉండటంతో గాయపడిన వారికి వైద్యం పూర్తి స్థాయిలో అందించలేక ఆమె ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి వస్తే వైద్యులు గంట ఆలస్యంగా వచ్చారని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల 108ల ద్వారా గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.    

కలెక్టర్‌ పరామర్శ..
గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట జగ్గయ్యపేట తహసీల్దార్‌ నరసింహారావు ఉన్నారు.

ఘటనా స్థలం పరిశీలన..
జాతీయ రహదారిపై ప్రమాద స్థలాన్ని జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి వీరప్రసాద్‌ పరిశీలించారు. ఆయన జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ శంకరాచారిని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంవీఐ ఎంవీఎన్‌ రాజు, చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సీఐ జయకుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement