వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ విజయారావు
ఆర్టీసీ బస్సులో రవాణాచేస్తున్న రూ.10 లక్షల విలువ చేసే చీరలను చోరీ చేసినకేసులో ఐదుగురు నిందితులను పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సి.హెచ్.విజయారావు ఈ కేసు వివరాలను సోమవారం విలేకరులకు వెల్లడించారు. నిందితులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం ఫకీర్ తండాకు(చోర్ తండా)కు చెందిన వారని తెలిపారు.
గుంటూరు ఈస్ట్: ఆర్టీసీ బస్సులో రూ.10 లక్షల విలువ చేసే చీరలను చోరీ చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సి.హెచ్.విజయారావు వివరాలు వెల్లడించారు. గుంటూరు కళామందిర్ షోరూమ్ ఇన్‌చార్జ్ వెంకట రామ్‌కుమార్ జూలై 11న రూ.10 లక్షలు విలువ చేసే 103 పట్టు చీరలున్న 3 బాక్సులను ఆర్టీసీ కార్గోలో విశాఖపట్నానికి బుక్ చేశారు. 10 రోజులైనా ఆ చీరలు విశాఖపట్నానికి చేరలేదు. దీంతో జూలై 21న పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో బస్సు డ్రైవర్, ఇతర సిబ్బందిపై విచారణచేసి వారు కాదని నిర్ధారించుకున్నారు.
ఐటీ కోర్ అధికారులు, సిబ్బంది అధ్యయనం చేసి ఇచ్చిన సమాచారంతో నిందితులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం ఫకీర్ తండాకు(చోర్ తండా) చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టిన కొద్దిసేపటికే నిందితులకు విషయం తెలియడంతో పరారై కొండ ప్రాంతంలో దాక్కున్నారు . పోలీసులు వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి స్థానిక పోలీసుల సహాయంతో నిందితులు బూక్యా నరేష్, గుగులోతు నరేష్, బూక్యా కోటయ్య, గుగులోతు రమేష్, బూక్యా రమేష్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10.13 లక్షలు విలువైన పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో చందన బ్రదర్స్ వస్త్ర వ్యాపార సంస్థలకు చెందిన వస్త్రాలను, పురుగుమందు డబ్బాలను చోరీ చేసినట్టు విచారణలో తేలింది. తెలంగాణ రాష్ట్రంలో వారిపై కేసులు ఉన్నాయి. కేసు పురోగతిలో కృషి చేసిన డీసీఆర్‌బీ డీఎస్పీ ప్రసాద్, డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీసీఎస్ సీఐ రత్నస్వామి, పాతగుంటూరు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఇన్‌చార్జ్ బాలాజీ, ఎస్‌ఐ సుబ్బారావు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment