నాందేడ్‌లో లభించిన దుండగులు అపహరించిన బస్సు విడిభాగాలు
సాక్షి, సిటీబ్యూరో: గౌలిగూడ బస్సు చోరీ ఉదంతంతో ఆర్టీసీ అప్రమత్తమైంది. మరోసారి ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా చర్యలకు ఉపక్రమించింది. నైట్ అవుట్ బస్సులపైన ఎప్పటికప్పుడు సమీప పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం ఇవ్వడంతో పాటు, స్టీరింగ్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. మరోవైపు రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బస్సుచోరీకి గల కారణాలు, సంస్థాగతమైన లోపాలు, తదితర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను అందజేసేందుకు శుక్రవారం చీఫ్ మేనేజర్ కృష్ణకాంత్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్, ఉప్పల్ డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డిలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బస్సు ఎందుకు చోరీకి గురైందీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ తెలిపారు.
నైట్ అవుట్ బస్సులన్నీ డిపో బయటే..
గ్రేటర్‌లోప్రతి రోజు 3,550 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. తెల్లవారు జామున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో తిరిగే బస్సులన్నీ డిపోలకు చేరుకుంటున్నాయి. డిపోల నిర్వహణ కోసం ఆర్టీసీ సొంత భద్రతను కలిగి ఉంది. కానీ మూడో షిఫ్టులో రాత్రి ఆలస్యంగా విధుల్లో చేరే సుమారు 700 నుంచి 1000 బస్సులను మాత్రం రాత్రి 12 గంటల తరువాత ఆఖరు బస్టాప్ వద్ద నిలిపివేస్తారు. ఆబస్సులు తిరిగి ఉదయం విధులు ముగించుకొని డిపోలకు చేరతాయి. కుషాయిగూడ నుంచి ఆఫ్జల్ గంజ్ వరకు రాకపోకలు సాగించే బస్సును ఇదే పద్ధతిలో డ్రైవర్ గౌలిగూడ వద్ద నిలిపి అక్కడే ఉన్న ఆర్టీసీ విశ్రాంతి భవనంలో నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు బస్సును అపహరించుకు వెళ్లారు. గతంలో కూడా ఇక్కడ నిలిపి ఉంచిన తాండూర్ డిపోకు చెందిన ఒక బస్సును అపహరించుకెళ్లి జూపార్కు వద్ద వదిలేసి వెళ్లారు. అంతకుముందు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగి ఉన్న బస్సును తీసుకెళ్లి నార్కట్‌పల్లి వద్ద వదిలారు. కానీ తాజాగా బస్సును అపహరించి నాందేడ్‌కు తీసుకెళ్లడంతో పాటు దాని విడి భాగాలన్నింటినీ తొలగించి సొమ్ము చేసుకోవడం వెనుక నిందితులు పెద్ద నెట్ వర్క్‌నే కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్టీసీకి రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.
బస్సు నంబర్ చూపుతున్న సిబ్బంది
కమిటీ ఏం చేస్తుందంటే..
గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. నైట్ అవుట్ బస్సులను నిలిపి ఉంచే పార్కింగ్ స్థలాలు, బస్టాప్‌లు, ఇతరత్రా ప్రదేశాలను పరిశీలించి అక్కడ బస్సుల భద్రతకు ఎలాంటి వాతావరణం ఉందనే అంశాన్ని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో, పోలీస్ పెట్రోలింగ్‌కు దూరంగా ఉండే ప్రదేశాల్లో బస్సులను నిలపకుండా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే నైట్ అవుట్ బస్సులపైన మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు, కమిషనర్లతోనూ సంప్రదింపులు జరుపుతారు. ఇదే సమయంలో గౌలిగూడ బస్సు చోరీ కారణాలను కూడా నిగ్గు తేలుస్తారు. ఈ కమిటీ అందజేసే నివేదిక ఆధారంగా బస్సుల భద్రతపై ఆర్టీసీ దృష్టి సారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment