సాక్షి ప్రతినిధి, చెన్నై,పెరంబూరు: బుల్లితెర నటి ప్రియాంక బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా పలువురు బుల్లితెర, వెండితెర నటీనటులు ఇలా బలవన్మరణాలకు పాల్పడ్డారు.దీంతో ఇలాంటి ఆత్మహత్యల సంఘటనలు సినీ, బుల్లితెర వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక నటి ప్రియాంక విషయం ఆత్మహత్య గురించి పలు ఆసక్తికరమైన అంశాలు ప్రసారం అవుతున్నాయి. కుటుంబ సమస్యల కారణంగానే ప్రియాంక ప్రాణాలు తీసుకుందని పోలీసులు అంటున్నారు. అయితే బుల్లితెర వర్గాలు వేరే విధంగా చెబుతున్నారు. ప్రిమాంక బుల్లితెరపై పాపులర్ నటిగా రాణించింది. ఇక్కడ నటీమణులకు కొన్ని నిషేధాజ్ఞలు ఉంటాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్‌గా నటించే నటీమణులకు మాతృత్వ నిషేధ ఒప్పందాలు ఉంటాయట.
ఈ విషయాన్ని ప్రియాంకకు సహ నటీమణులు చెబుతున్న మాట. నటీమణులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా శరీరాకృతులను మెయింటైన్ చేయాలట. హీరోయిన్‌గా నటించే నటీమణులు గర్భం ధరించనని సీరియల్ నిర్మాణ సంస్థలకు అగ్రిమెంట్‌లో సంతకాలు చేయాల్సి ఉంటుందట. వారు మధ్యలో గర్భం దాల్చితే పాత్ర స్వభావానికి ఇబ్బంది కలుగుతుందని అలాంటి ఒప్పందాలు చేసుకుంటారని ప్రియాంక సహ నటీమణులు అంటున్నారు. ఈ విషయంలోనే ప్రియాంకకు ఆమె భర్తకు మధ్య వివాదం జరిగి ఉంటుందని, దీంతో విడిగా ఉంటున్న ప్రియాంక మానసిక వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. నటీనటులకు ముఖ్యంగా హీరోయిన్లకు మానసిక స్థైర్యం కలిగించేలా కౌన్సెలింగ్ అవసరం అని, అలాంటి చర్యలను బుల్లితెర నటీనటుల సంఘం చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రియాంక మృతి వ్యవహారంలో పోలీసుల విచారణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment