సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో ఇద్దరు సాయుధులు ఓ టీవీ జర్నలిస్ట్‌పై ఆయన నివాసంలోనే కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సహారా సమయ్ హిందీ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ అనూజ్ చౌదరి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజాపూర్ గ్రామం నుంచి ఇంటికి తిరిగివచ్చిన అనంతరం అనూజ్‌పై హెల్మెట్లు ధరించిన సాయుధులు ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.
అనూజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, వ్యక్తిగత శతృత్వమే జర్నలిస్ట్‌పై దాడికి కారణంగా ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దాడికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అనూజ్ చౌదరి బీఎస్‌పీ కౌన్సిలర్ భర్త కావడం గమనార్హం. పాతకక్షల నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని ఎస్పీ వైభవ్ కృష్ణ పేర్కొన్నారు. దాడి చేసిన వారిని బాధిత కుటుంబ సభ్యులు గుర్తించారని, నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment