
బనశంకరి : ఓ విదేశీ బ్యాంకులో అకౌంటెంట్లుగా చేరిన ఇద్దరు వ్యక్తులు పెద్ద మొత్తంలో నగదును వారి సొంత ఖాతాల్లోకి మళ్లించిన కేసులో సదరు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 8.14 కోట్ల నగదు, 470 గ్రాముల బంగారు నగలు, భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషర్ సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన జెపీ మోర్గాన్ బ్యాంకు ఇక్కడి మారతహళ్లిలో ఉంది. ఈ బ్యాంకులో 2013లో బెళ్లందూరుకు చెందిన సురేశ్‌బాబు, దొడ్డగుబ్బికి చెందిన మారుతి అలియాస్ రాము అకౌంటెంట్లుగా చేరారు. 2017 ఆగస్టు 24న బ్యాంక్‌కు చెందిన ఖాతాదారుడి నుంచి మరో ఖాతాదారుడి అకౌంట్‌కు రూ.12.15 కోట్ల నగదు బదిలీ కావాల్సి ఉంది.
ఈ ఇద్దరు అకౌంటెంట్లు ఆ నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుని బంగారు ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో ఇద్దరూ ఉద్యోగాలు వదిలివేశారు. ఈ నేపథ్యంలో ఓ ఖాతాదారుడు తనకు రావాల్సిన నగదు అకౌంట్‌లో జమ కాలేదని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మారతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెన్నైలో తలదాచుకున్న మారుతిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇతడిని విచారణ చేయగా అసలు గుట్టు విప్పాడు. అతడి సమాచారంతో సురేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులకు రూ. 50 వేల నగదు బహుమతిని కమిషనర్ సునీల్ కుమార్ ప్రకటించారు.