
సాక్షి, హైదరాబాద్: పాత కక్షల కారణంగా సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ఓ లేడీ డాక్టర్‌ను హతమార్చేందుకు ఆమె వ్యాపార భాగస్వామి చేసిన కుట్ర బట్టబయలైంది. సుపారీ తీసుకున్న వ్యకి ఈ కుట్రను బయట పెట్టడంతో డాక్టర్‌కు ప్రాణాపాయం తప్పింది. శనివారం హయత్‌నగర్ డీసీపి వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం... తట్టిఅన్నారం ఇందూ అరణ్య కాలనీలో నివసించే డాక్టర్ బొమ్మినేని దుర్గారాణి గైనకాలజిస్ట్. అదే కాలనీలో నివసించే బుర్ర రమేష్‌గౌడ్ తాను డాక్టర్‌నే అని చెప్పుకుని పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి కర్మన్‌ఘాట్‌లో జీవన్ ఆసుపత్రి, వరంగల్ జిల్లా పెద్దపల్లిలో శ్రీ సాయి ఆసుపత్రిని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో రమేష్‌గౌడ్ సెటిల్‌మెంట్ చేసుకుని వ్యాపార భాగస్వామిగా విడిపోయాడు. తర్వాత పలు మార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడనే కారణంగా రమేష్‌గౌడ్‌పై పలు పోలీస్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన డాక్టర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. కిరాయి హంతకులను ఏర్పాటు చేయాలని హన్మకొండకు చెందిన జంపాల రమేష్‌ను కోరాడు. ఆయన హన్మకొండ ప్రకాష్‌రెడ్డిపేట్‌కు చెందిన మహ్మద్ రఫీతో మాట్లాడాడు. డాక్టర్‌ను హత్య చేసేందుకు రఫీ 10 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. నాలుగు దఫాలుగా 5 లక్షలను అడ్వాన్సుగా ముట్ట జెప్పగా 2 నెలల్లో పనిపూర్తి చేయాలని మిగితాది పనిపూర్తయిన తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
డాక్టర్‌ను చంపేందుకు రఫీ మూడు సార్లు రెక్కీ నిర్వహించాడు. కాని చంపలేక పోయాడు. దీంతో రమేష్‌గౌడ్ ఆయనపై ఒత్తిడి పెంచాడు. ఒత్తిడిని భరించలేక రఫీ విషయాన్ని డాక్టర్ దుర్గారాణి, ఆమె భర్త రమేష్ బాబుకు తెలిపాడు. వీరి వద్దనుంచి డబ్బులు లాగాలని ప్రయత్నించిన రఫీ పలు మార్లు ఫోన్‌లు చేసి బెదిరించ సాగాడు. దీంతో ఈనెల 13న దుర్గారాణి హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. రమేష్‌గౌడ్, రఫీల ఫోన్‌లపై నిఘా పెట్టిన పోలీసులు కుట్ర విషయం తెలుసుకుని రఫీ, జంపాల రమేష్‌లను అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి ఒక ఎల్‌ఈడి టీవి, 2 సెల్‌ఫోన్‌లు, రూ. 45వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. కాగా ప్రధాన నిందితుడు రమేష్‌గౌడ్, మరోనిందితుడు తిరుపతిలు పరారీలో ఉన్నారు.
పాత కక్షల కారణంగా లేడీ డాక్టర్ హత్యకు కుట్ర
Comments
Please login to add a commentAdd a comment