ప్రమాదం జరిగిన మత్స్యగెడ్డ ప్రాంతం
పెదబయలు(అరకులోయ): దుస్తులు ఉతకడానికి వెళ్లి మత్స్యగెడ్డలో పడి ఇద్దరు చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ గంపరాయి(ఎలుగులమెట్ట) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎలుగులమెట్ట గ్రామానికి చెందిన కిముడు భవానీ అనే మహిళ ఆమె కుమార్తె కిముడు శైలజ(12), వారి పక్కింట్లో ఉంటున్న అడపా హిందుమతి(9) కలిసి సోమవారం ఇదే పంచాయతీ కాగుల గ్రామ సమీపంలో మత్స్యగెడ్డకు దుస్తులు ఉతకడానికి మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లారు. అయితే కిముడు భవానీ దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమై ఉండగా, ఆమెకు కొంతదూరంలో దుస్తులను నీటిలో జాడించే పనిలో ఉన్న చిన్నారులిద్దరూ ప్రమాదవశత్తూ కాలుజారి గెడ్డలో పడి మునిగిపోయారు. మునిగిన తరువాత గమనించిన తల్లి గ్రామంలోకి వెళ్లి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు వచ్చి గెడ్డలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. గంపరాయి ప్రాథమిక పాఠశాలలో కిముడు సైలజ 6వ తరగతి, అడపా హిందుమతి 4వ తరగతి చదుతున్నారు.
గ్రామంలో విషాదఛాయలు
వేసవి సెలవులు కావడంతో అప్పటి వరకు మిగతా పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకున్న ఆ ఇద్దరూ అంతలోనే గెడ్డలో పడి మృతి చెందారన్న విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పక్కనే ఉండి కూడా పిల్లల్ని రక్షించుకోలేకపోయానని శైలజ తల్లి భవానీ భోరున విలపించింది. తండ్రి బొంజుబాబు, హిందుమంతి తండ్రి అడపా కొండబాబు, తల్లి పూర్ణిమ రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి. స్థానిక తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ వంతాల కమలాకర్, వీఆర్వో వెంకటరమణ తదితరులు చిన్నారుల మృతదేహాలను పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా ఉన్నతాధికారులకు నివేదిస్తానని తహసీల్దార్ తెలిపారు.
గతంలో ప్రమాదాలు
♦ 2012లో మత్స్యగెడ్డలో గలగండ పంచాయతీ మంగబంద సమీపంలో చేపల వేటకు వెళ్లి గంపరాయి పంచాయతీ సుండ్రుపుట్టు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.రెండు రోజుల తరువాత మృతదేహాలు వెలికి తీశారు.
♦ 2017 జూలై 5 తేదీన పెదకోడాపల్లి పంచాయతీ పరిదానిపుట్టు గ్రామానికి చెందిన కిల్లో లక్ష్మీ (35)దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశత్తూ కాలిజారి గెడ్డలో పడి కొట్టుకు పోయింది.
Comments
Please login to add a commentAdd a comment