మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం  | Two Children Drown In Pond Near Shettoor | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం 

Published Sat, Aug 24 2019 11:46 AM | Last Updated on Sat, Aug 24 2019 11:46 AM

Two Children Drown In Pond Near Shettoor - Sakshi

మృతి చెందిన బన్నీ, బాలు రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

సాక్షి, శెట్టూరు: బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులను చెరువు మింగేసింది. నీటమునుగుతున్న తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి అన్న కూడా జల సమాధి అయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులిద్దరూ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన శెట్టూరు మండలం కరిడిపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం కరిడిపల్లికి చెందిన గోవిందయ్య, మహంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బన్నీ (10)ఐదో తరగతి, చిన్న కుమారుడు బాలు (7) రెండో తరగతి చదువుతున్నారు. శుక్రవారం కృష్ణాష్టమి సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్నారు. సాయంత్రం గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ అనే మరో బాలుడితో కలిసి అన్నదమ్ములిద్దరూ బహిర్భూమికని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. బాలు, బన్నీ పోటీపడుతూ నీళ్లున్న గుంత వద్దకు పరుగులు తీశారు.

బాలు కాలు జారి గుంతలోకి పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకని బన్నీ చేయందించాడు. అయితే గుంత లోతుగా ఉండటంతో బాలు మునిగిపోయాడు. అదే క్రమంలో తమ్ముని చేయి పట్టుకున్న బన్నీ కూడా అందులోకి పడిపోయాడు. ఇద్దరూ మునిగిపోతుండటం గట్టున ఉన్న హర్షవర్ధన్‌ గమనించి పరుగున ఊరిలోకి వెళ్లి బాలు, బన్నీల పిన్నమ్మ  ఈశ్వరమ్మకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆమె స్థానికులను పిలిచుకుని చెరువు వద్దకు పరుగులు పెట్టింది. పదిమందికి పైగా గ్రామస్తులు చెరువులోకి దిగి ఇద్దరు చిన్నారులను బయటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికీ బన్నీ, బాలు ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ నాగరాజు, ఎంఈఓ శ్రీధర్, వీఆర్వో గంగాధర్‌లు పరిశీలించి, కేసు నమోదు చేశారు. 

దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..! 
గోవిందయ్య శుక్రవారం గ్రామ సమీపంలోని గొర్రెల మేపుకోసం వెళ్లాడు. భార్య మహంతమ్మ ఓ రైతు పొలంలో టమాట పంటను తొలగించడానికి కూలి పనులకు వెళ్లింది. పొలం పని ముగించుకుని వచ్చాక పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి ఆమె గొర్రెల మేపు కోసం వెళ్లిన భర్త వద్దకు వెళ్లింది. సాయంత్రం వేళ ఇద్దరు కుమారులు చెరువులో పడ్డారని వార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ పరుగులు పెడుతూ చెరువు వద్దకు వచ్చారు. చెరువు గట్టుపై విగత జీవులుగా పడి ఉన్న కుమారులను చూసి రోదించడం అందరినీ కలచివేసింది. ‘ఇంటివద్దే ఆట్లాడుకుంటుంటారనుకునిపోతినే...అంతలోపే ఇలా...దేవుడు ఇంత అన్యాయం చేశాడా...ఒకేసారి ఇద్దరినీ పొట్టన పెట్టుకుంటాడా...అయ్యో..మేము ఏం పాపం చేశాము దేవుడా...’ అంటూ మహంతమ్మ కన్నీటి పర్యంతమైంది. 

బాధిత కుటుంబానికి పరామర్శ  
చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన తెలుసుకున్న శెట్టూరు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సోమనాథ్‌రెడ్డి, నాయకులు హరినాథ్‌రెడ్డి, ఎంఎస్‌రాయుడు, తిప్పేస్వామి, రామకృష్ణ, తిమ్మరాజు, లింగప్ప, శ్యాంసుందర్‌చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement