
మృతుల కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇన్‌సెట్లో మృతులు శ్రీనివాస్, ఆనంద్ (ఫైల్)
సాక్షి, నల్లగొండక్రైం : కరెంట్ కాటుకు ఇద్దరు సోదరులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం పజ్జూరి గ్రామానికి చెందిన పేర్ల శేఖర్, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు పేర్ల శ్రీని వాస్ (26) బీటెక్ పూర్తిచేయగా, చిన్నకుమారుడు పేర్ల ఆనంద్ (20) డిగ్రీ చదువుతున్నారు. మరో కుమార్తె వెన్నెల ఉంది. ఈ కుటుంబం కొంతకాలంగా పట్టణంలోని బీటీఎస్ ప్రాంతంలో గల రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
మూత్రవిసర్జనకు బయటికి వచ్చి..
అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీనివాస్ మూత్ర విసర్జన చేసేందుకు ఇంటిబయటికి వచ్చాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఇంట్లోకి ఉన్న కనెక్షన్ వైర్లు గాలివానకు ఒకదానికి ఒకటి ఆనుకోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అనంతరం ఓ వైరు తెగి బయటికి వస్తున్న శ్రీనివాస్‌పై పడడంతో గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న తమ్ముడు ఆనంద్ వచ్చి కిందపడిన సోదరుడిని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు.
సోదరి వచ్చి చూడడంతో..
ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్లిన సోదరుల అరుపులు విని వారి సోదరి ఎన్నెల బయటికి వచ్చింది. సోదరులపై విద్యుత్ వైరు పడి ఉండడం, వారు స్పృహలో లేకపోవడంతో గట్టిగా అరిచి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
మృతుడి కుటుంబాన్ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలపై పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. మృతుడి కుటుం బానికి ఆర్థికసాయం అందజేశారు. సంఘటన జరిగిన నివాసాన్ని పరిశీలించారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాన్ని తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నల్లగొండ తహసీల్దార్ నాగార్జునరెడ్డి పదివేల రూపాయలు అందజేశారు.
పజ్జూరులో విషాదఛాయలు
తిప్పర్తి (నల్లగొండ): మండలంలోని పజ్జూరుకు చెందిన పేర్ల శేఖర్ ఇద్దరు కుమారులు విద్యుదాఘాతానికి బలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దహనసంస్కారాలు నిర్వహించేందుకు శ్రీనివాస్, ఆనంద్‌ల మృతదేహాలను సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులంతా మృతుల ఇంటికి వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు.
పరామర్శించిన ఎమ్మెల్యే వీరేశం, కంచర్ల
మృతుల కుటుంబాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి పరామర్శించారు. మృతదేహలపై పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కుటుంబానికి రెండు లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కె మోహిజ్, గోవర్ధన్,వెంకట్‌రెడ్డి, లక్ష్మయ్య, వెంకన్న, సహదేవురెడ్డి, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment