జంగమ్మ మృతదేహం వద్ద బంధువుల రోదన
మూడు రోజులకే మూగబోయిన పెళ్లి ఇల్లుకుమారుడి పెళ్లి జరిగిందనే సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతోకాలం నిలవలేదు. బంధువులతో కళకళలాడిన ఇల్లు పెళ్లి కుమారుడి తల్లిదండ్రుల దుర్మరణంతో ఒక్కసారిగా మూగబోయింది. కొడుకు, కోడలిని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన వారు కానరానిలోకానికి వెళ్లారు. రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. నాగార్జున సాగర్ – హైదరాబాద్ రహదారిపై క్రూజర్ వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు.
యాచారం/ మాడ్గుల: యాచారం సీఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన రెడ్డెమోని యాదయ్య (45), జంగమ్మ(40) దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు శ్రీను(25)కు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మ న్నెగూడకు చెందిన అనిత అనే అమ్మాయితో ఈ నెల 25న మాల్ సమీపంలో నిరూచిమండ్ హో టల్‌లో వివాహం జరిగింది.
పెళ్లికొడుకు, కూతురును తీసుకెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం జంగమ్మ, యాదయ్య దంపతులు క్రూయిజర్‌లో 12 మంది బంధువులతో కలిసి కొల్కులపల్లి గ్రామం నుంచి మాన్నెగూడకు బయల్దేరారు. మార్గమధ్యలో సాగర్‌రోడ్డుపై తమ్మలోనిగూడ గేటు సమీపంలో తక్కళ్లపల్లి నుంచి మాల్ వైపే వేగంగా వస్తున్న లారీ క్రూజర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో క్రూయిజర్ వెనుక సీట్లో కూర్చున్న రెడ్డమోని జంగమ్మకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
జంగమ్మ భర్త యాదయ్య, వీరి కొడలైన జ్యోతి, బంధువులైన రాధిక, అరవింద్‌లకు తీవ్రగాయాలు కావడంతో 108లో నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా యాదయ్య మార్గమధ్యలోనే మృతి చెందాడు. జ్యోతి, రాధిక, అరవింద్‌లతో పాటు స్వల్ప గాయాలైన మరో ఇద్దరిని నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స జరిపిస్తున్నారు. మరికొద్ది సేపట్లో గమ్యానికి చేరుకోవచ్చనే సమయంలో మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ పెళ్లింట్లో తీవ్ర దు:ఖాన్ని నింపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. క్రూయిజర్, లారీ డ్రైవర్ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
రోదనలతో దద్దరిల్లిన సాగర్‌రోడ్డు
సాగర్‌రోడ్డుపై క్రూయిజర్, లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారనే సమాచారంతో కొల్కుపల్లి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు తరలివచ్చారు. మృతదేహాలను చూసి వందలాది మంది బంధువుల రోదనతో సాగర్‌రోడ్డు దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో తమ్మలోనిగూడ గ్రామా నికి చెందిన యువకులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించేలా కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment