గంగిరెడ్డి దుర్గారెడ్డి, షేక్ ఖాజావలి మృతదేహాలు
సాక్షి, ప్రకాశం: దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి దుర్గారెడ్డి (42) సుశీల దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గంగిరెడ్డి తనకు ఉన్న 2.50 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. మిరప, వరి పంటల సాగులో నీటి ఎద్దడి వలన బోర్లు వేసి ఎక్కువ ఖర్చుచేసినా నష్టాలే మిగలడంతో మూడేళ్ల క్రితం కుటుంబంతో కలిసి బతుకు దెరువు కోసం విజయవాడ కూలి పనులకు కుటుంబంతో కలసివెళ్లాడు. అక్కడ ఇంటి అద్దెలు, జీవన కర్చులు ఎక్కువ ఉండటం వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో అక్కడ బతకలేక అప్పులు చేయాల్సి వచ్చింది. దాదాపు రూ.6లక్షల వరకు అప్పు తేలింది. దీంతో అతడు మద్యానికి బానిసయ్యాడు. గ్రామంలో వ్యవసాయ పనులు కూడా చూసుకుంటూ విజయవాడ వెళ్లొస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. నెల రోజుల క్రితం దర్శి ఆంధ్రాబ్యాంక్‌లో రూ.లక్ష లోను తీసుకుని జూదం వంటి వ్యసనాలకు ఖర్చు చేశాడు.
తరచు అప్పులు వడ్డీలు గుర్తుకొస్తున్నాయంటూ ఒక సారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం గుడికి వెళ్తున్నానని చెప్పి విజయవాడ నుంచి బొట్లపాలెం గ్రామ సమీపానికి వచ్చాడు. అక్కడ ఓ చెట్టు కింద తన వెంట తెచ్చుకున్న పురుగుమందును మద్యంలో కలుపుకొని తాగి మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ అశోక్ వర్ధన్, ఏడీ అర్జున్ నాయక్, ఏఓ మధుబాబులు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. దుర్గారెడ్డి మృతదేహం వద్ద లభించిన నోట్ పుస్తకంలో తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, అప్పులు భారంగా మారడం, ఆ కారణంగా చెడు అలవాట్లకు బానిసగా మారి దిక్కుతోచక ఆత్మహత్య చేసుకుంటునట్టు రాసి ఉందని గుర్తించారు.
కాలం కలిసి రాక బలవన్మరణం..
నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన షేక్ ఖజావలి (59)కు భార్య ఖరీమాబీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిల్లు చేసి పంపించారు. తనకు వారసత్వంగా వచ్చిన ఎకరన్నర పొలంలో ఖాజావలి పొగాకు సాగు చేసేవాడు. దీంతో పాటు రెండు పొగాకు బ్యారన్‌లను అద్దెకు తీసుకొని వాటి కింద 16 ఎకరాల పొగాకు పంటకు, మరో 15 ఎకరాలు శనగ పంట కోసం కౌలు భూమి తీసుకొని వ్యవసాయం చేసేవాడు. గడచిన నాలుగేళ్ళలో వర్షాలు లేక పంటలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అయినప్పటికి ఏ ఏడుకాయేడు ఈ ఏడాదైనా బాగుండకపోతుందా అన్న ఆశతో అందిన కాడికి అప్పులు చేయడంతో పాటు ఉన్న బంగారాన్ని అంతా గ్రామంలోని సిండికేట్ బ్యాంక్‌లో కుదువ పెట్టి 5 లక్షల వరకు వ్యవసాయ రుణంతో పాటు బయట మరో 15 లక్షల రూపాయలు మొత్తం 20 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు.
గత ప్రభుత్వంలో 80 వేల రూపాయలు మాత్రమే రుణమాఫీకి అర్హత సాధించాడు. అది కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో 3 విడతల్లో 45 వేల రూపాయల వరకే రుణం మాఫీ అయింది. అది కూడా ఉన్న అప్పుకు వడ్డీ రూపంలో పోవడంతో రుణమాఫీ వలన మృతుడికి ఏ మాత్రం ఉపశమనం కలుగలేదు. సరైన వర్షాలు లేక శనగ పంట దిగుబడి లేకపోవడం, పొగాకుకు ధరలు లేకపోవడంతో అప్పులు లెక్కకు మించాడు. ఈ అప్పుల నుంచి కొంత మేరకైనా బయట పడదామని గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలోని సపోటా తోటను పంట కౌలుకు తీసుకున్నాడు. అక్కడ కూడా రైతుకు చుక్కెదురైంది. భూమిలో తేమ లేక సపోటా పంట కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో అప్పుల వారు తమ బాకీ తీర్చాలని ఒత్తిడి పెరిగింది. చేసేదేమి లేక అప్పుల వారి వివరాలను కాగితంలో రాసుకున్నాడు.
సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఖాజావలి రాత్రికి తిరిగిరాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం ఖాజావలి తాను కౌలుకు తీసుకున్న సపోటా తోటలో ఉరి వేసుకున్నట్టు గుర్తించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. ఘటనా స్థలాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేమాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
సపోటా తోటలో ఉరి వేసుకొని మృతి చెందిన షేక్ ఖాజావలి
Comments
Please login to add a commentAdd a comment