సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వికృత చేష్టలు | Two Government Teachers Making Sexual Harassment For School Children In Peddipalem, Visakhapatnam | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వికృత చేష్టలు

Published Thu, Aug 15 2019 12:53 PM | Last Updated on Thu, Aug 15 2019 1:02 PM

Two Government Teachers Making Sexual Harassment For School Children In Peddipalem, Visakhapatnam - Sakshi

గుడే వెంకటేశ్వరరావు, సుంకి సుందరరావు

సాక్షి, భీమిలి(విశాఖపట్నం) : పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెచ్చిన సంఘటన ఇది. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే కామంతో కళ్లు మూసుకుపోయి పసి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. లేగ మొగ్గలపై వికృతంగా ప్రవర్తించారు. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్రంగా దండిస్తామని బెదిరించారు. గత కొన్ని నెలలుగా తమ పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నా ఏమీ తెలియని ఆ పసి పిల్లలు మౌనంగానే భరించారు. ఉపాధ్యాయలకు భయపడి లోలోపలే దుఃఖించారు. మండలంలోని పెద్దిపాలెంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇన్నాళ్లకు ఆ ఉపాధ్యాయుల పాపం పండి వైద్యుల రూపంలో విషయం వెలుగులోకి వచ్చింది. 

నగ్నంగా సెల్‌ఫోన్లలో చిత్రీకరణ 
పెద్దిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 42 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అనాథ పిల్లలు కోసం స్థానికంగా హార్విస్ట్‌ అనే అనాథ శరణాలయాన్ని నడుపుతున్నారు. అందులో ఉన్న కొంతమంది పిల్లలు కూడా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరు మహిళా ఉపాధ్యాయులతో పాటు గుడే వెంకటేశ్వరరావు (55 ఏళ్లు), సుంకి సుందరరావు (50 ఏళ్లు) అనే ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వెంకటేశ్వరరావు, సుందరరావు మొదట నుంచి వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. తోటి ఉపాధ్యాయునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారికి అలవాటుగా మారింది. తరగతి గదిలో ఒంటరిగా ఉండే పిల్లలపై గత కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బాలికలను అర్ధనగ్నంగా ఉంచి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ దుశ్చర్య గత కొంతకాలంగా సాగుతోంది.

పాఠశాలలో విచారణ జరుపుతున్న డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవిశంకర్‌రెడ్డి 

పిల్లల ఏడుపు.. వైద్యుల ఆరా  
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు అలంకరిస్తున్నారు. ఇదే అదునుగా ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సుందరరావు 3,4 తరగతులు చదువుతున్న ఇద్దరు గిరిజన బాలికలను పాఠశాలపై అంతస్తులోకి తీసుకొని వెళ్లారు. అక్కడకు ఎవరూ రాకుండా ఇద్దరు మగ పిల్లలను మెట్లపై కాపలాగా ఉంచారు. తరగతి గది లోపల పిల్లలను అర్ధనగ్నంగా ఉంచి ఉపాధ్యాయులు లైంగికంగా హింసించడంతో పాటు సెల్‌ఫోన్‌లో తమ వికృత చేష్టలను రికార్డు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య తనిఖీలు చేయడానికి కేజీహెచ్‌ కేంద్రంగా నడుస్తున్న రాష్ట్రీయ శిశు సంరక్షణ కేంద్రం వైద్యులు మొబైల్‌ వ్యాన్‌తో పెద్దిపాలెం పాఠశాలకు వచ్చారు.

వారు విద్యార్థినులను ఆరోగ్య తనిఖీలు చేస్తుండగా ఇద్దరు విద్యార్థినులు ఏడుస్తుండడంతో ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఆరా తీశారు. పిల్లలు చెప్పింది విని వారు నివ్వెరుపోయారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవిశంకర్‌ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్‌–1 ఏసీపీ త్రినాథ్, సీఐ జి.శంకరరావు పాఠశాల వద్దకు చేరుకున్నారు. వేధింపులకు గురైన ఇద్దరు పిల్లలను రహస్యంగా విచారించి సంఘటన నిజమేనని నిర్ధారించుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు ప్రవర్తనపై తోటి ఉపాధ్యాయులను అడిగి వివరాలు రాబట్టారు. అనంతరం వెంకటేశ్వరరావు, సుందరరావులను అదుపులో కి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నాలుగు సెక్షన్లు నమోదు
పిల్లలపై లైంగిక వేధింపులు..వికృత చేష్టలకు పాల్పడిన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సుందరరావుపై పిల్లలిచ్చిన సమాచారం మేరకు 354ఎ, 354సీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, పోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎస్సీ, ఎస్టీ సెల్‌–1 ఏసీపీ త్రినాథ్‌ తెలిపారు. 

ఆరేళ్లుగా వెంటేశ్వరరావు ఇక్కడే తిష్ట
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వెంకటేశ్వరరావు ఆరేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. తగరపువలసలో నివాసం ఉంటున్న ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఇద్దరూ పెద్దిపాలెంలో పని చేసేవారు. ఆ సమయంలో తోటి ఉపాధ్యాయురాల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో వెంకటేశ్వరరావు భార్య ఆ ఉపాధ్యాయురాలిని బతిమాలి వివాదాన్ని పెద్దది కాకుండా చూసుకున్నట్టు సమాచారం. అయితే వెంకటేశ్వరరావు భార్య గతేడాది మరణించగా 55 ఏళ్ల వయసులోనూ అతను రెండో వివాహం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా సుందరరావు ఆరు నెలలు క్రితం విజయనగరం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇద్దరిదీ ఒకటే బుద్ధి కావడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. పాపం పండడంతో కటకటాలు వెనక్కి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement