
జాతీయరహదారిపై బెండపూడి వద్ద హోటల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ లారీ
పొద్దునే టీ తాగేందుకు కొందరు.. టిఫిన్ చేసేందుకు మరికొందరు ఆ హోటల్ దగ్గరకు చేరారు. ఇంతలో ఓ లారీ వేగంగా అటుగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి, తొండంగి (తుని): బెండపూడి జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి ట్రాలీ లారీ బుధవారం ఉదయం దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బెండపూడికి చెందిన దోనేపూడి వీరబ్బాయి హైస్కూల్ ఎదురుగా రాజమండ్రి వైపు వెళ్లే రోడ్డు పక్కన హోటల్ నిర్వహించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో విశాఖ వైపు నుంచి వస్తున్న ట్రాలీ లారీ డ్రైనేజీపై ఐరన్ గ్రిల్స్‌ను, ఆటోను, మోటర్ బైక్‌లను ఢీకొంటూ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో గ్రామానికి చెంది తుమ్మలపల్లి సత్తిబాబు(45) హోటల్ వద్దకు టీ తాగేందుకు వస్తుండగా.. అప్పటికే వీరబ్బాయి టీకొట్టు వద్ద టిఫిన్ కోసం మరికొంత మంది వేచి ఉన్నారు.
దీంతో వీరిపైకి ట్రాలీ దూసుకు వచ్చింది. ఈ సంఘటనలో సత్తిబాబు అక్కడిక్కడే మృతిచెందగా బూసాల సాయి బాపిరాజు(15), యడ్లపల్లి శ్రీను, కత్తిపూడికి చెందిన దువ్వాడ జార్జ్, సాన్ని చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా బాపిరాజు రెండు కాళ్లు లారీ కింద ఇరుక్కుపోవడంతో తేటగుంట హైవే సిబ్బంది, పోలీసులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం గాయపడిన వారిని తుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి క్రేన్‌ల సహాయంతో ట్రాలీలారీని తొలగించారు. కాగా కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాపిరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమై ఉంటుందని స్థానికులు అంటున్నారు.
బెంబేలెత్తిన జనం
కొద్ది రోజుల క్రితం బెండపూడి గ్రామానికి చెందిన నలుగురు కత్తిపూడి జాతీయరహదారిపై లారీ ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన మరువక ముందే బుధవారం మరో సంఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాలీ లారీ ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన సత్తిబాబుకు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో మృతుడు బాపిరాజు పదోతరగతి వరకు చదువుకున్నాడు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.