మృత్యువేగం | Two Men Died in Car Accident East Godavari | Sakshi
Sakshi News home page

మృత్యువేగం

Published Mon, May 13 2019 1:45 PM | Last Updated on Mon, May 13 2019 1:45 PM

Two Men Died in Car Accident East Godavari - Sakshi

క్వారీ లారీని ఢీకొన్న కారు

వారందరిదీ తూర్పుగోదావరి జిల్లా కాకరాపల్లి గ్రామం. విశాఖలో ఉన్నత విద్యను విజయనగరం జిల్లాలో అభ్యసిస్తున్నారు. వారు ప్రయోజకులవుతారని వారి తల్లిదండ్రులు వీరిని పెద్దతో ఖర్చుతో చదివిస్తున్నారు. విలాసాలకు అలవాటు పడిన విద్యార్థులు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. అదే వారి పాలిట మృత్యువైంది. అరకు నుంచి గంజాయి రవాణా చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అందులో ఇద్దరు మృత్యువాత పడగా... మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చదువు కోసం వచ్చినవారు అడ్డదారి విలాసాలకు అలవాటు పడి కన్నవారికి కడుపు కోత మిగిల్చారు.  

తూర్పుగోదావరి, కొత్తవలస (శృంగవరపుకోట): కన్నబిడ్డలకు మంచి చదువు చదివించి వారిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేయాలన్నది ఆ తల్లిదండ్రుల ఆశ. కానీ తెలిసీ తెలియని వయసులో కన్నవారి ఆశలు కల్లలు చేసి... ప్రమాదాలను కోరి తెచ్చుకున్నారు ఓ ముగ్గురు యువకులు. పుట్టింది పెరిగింది తూర్పు గోదావరి జిల్లా... చదువుతున్నది విశాఖపట్నం... కానీ ప్రమాదంలో ఇరుక్కుని విజయనగరం జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. హృదయ విదారకమైన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన బంటుపల్లి వినయ్‌భాస్కర్‌(19), వీరురెడ్డి ఎస్‌.వి.బి.సాత్విక్‌(19), పెనుముచ్చి సాయిమిధున్‌(23) మంచి స్నేహితులు. వినయ్‌భాస్కర్‌ విశాఖపట్నం డెయిరీ ఫారం వద్ద ఉన్న ఫుడ్‌ క్రాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మెదటి సంవత్సరం చదువుతున్నాడు. సాత్విక్‌ విశాఖ గీతం యూనివర్శిటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

మరో విద్యార్థి సాయిమిధున్‌ కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో తృతీయ సంవత్సరం బీటెక్‌ చదువుతున్నాడు. వీరు చదువుల మాటెలా ఉన్నా... విలాసాలకు అలవాటు పడ్డారు. చెడు సావాసాలకు బానిసలయ్యారు. శనివారం రాత్రి వినయ్‌భాస్కర్‌ తన తండ్రికి బాగులేదని చెప్పి.. గీతం యూనివర్శిటీలో ఎంటెక్‌ చదువుతున్న రాజీవ్‌ కృష్ణ అనే స్నేహితుడికి చెందిన హోండా బ్రియో కారును తీసుకుని ఇద్దరు స్నేహితులతో కలసి రాత్రి 11 గంటల సమయంలో అరకు వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున గంజాయి ప్యాకెట్లు కారులో తీసుకువస్తున్నారు. గమ్యస్థానానికి వేగంగా చేరుకోవాలన్న ఆతృతతో వస్తున్నారు. ఇంతలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన ముషిడివాడ నుంచి విజయనగరం జిల్లా సోంపురం క్వారీ నుంచి పిక్క తరలించేందుకు వెళుతున్న క్వారీ లారీని కొత్తవలస మండలం తుమ్మికాపల్లి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి గోదావరి లే అవుట్‌ మధ్యలో బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనతో లారీ లోపలికి కారు చొచ్చుకుపోయింది. ఉదయాన్నే అటుగా వెళుతున్న స్థానికులు వారిని బయటకు తీసి 108కు సమాచారం అందించారు.

ఇద్దరు విద్యార్థుల మృతి  
వినయ్‌భాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సాత్విక్‌ 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కొన ఊపిరితో ఉన్న సాయిమిధున్‌కు 108 సిబ్బంది చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ సత్యనారాయణ పోలీసులకు లొంగిపోయాడు. విద్యార్థుల మృతిపై ఎస్సైలు ధర్మేంద్ర, క్రాంతికుమార్‌ శవ పంచనామా చేసి కేసులు నమోదు చేయగా, సీఐ ఆర్‌.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్‌ బ్రాంచి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి రవాణాపై అనుమానాలు
చదువు కోసం వచ్చిన విద్యార్థులు గంజాయి రవాణా చేయటం ఏమిటని.. తన కుమారుడికి ఇలాంటి అలవాట్లు ఎవరూ చేశారో.. అసలు గంజాయి రవాణా చేయటం వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీయాలని వినయ్‌ భాస్కర్‌ తండ్రి, బంధువులు కోరుతున్నారు. నాశనం అయిపోతున్న విద్యార్థుల జీవితాలు బాగు చేయాలని వారు విన్నవించుకున్నారు. పేరు మోసిన గీతం కాలేజీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడటం చూస్తుంటే దీని వెనుక ఏదో రాకెట్‌ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు అన్నారు.

చదువుకుంటారని పంపిస్తే..
పెద్ద చదువులు చదవక పోయినా కొడుకు ఉన్నత చదువులు చదువుకుంటానంటే విశాఖపట్నం పంపానని.. ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదని వినయ్‌భాస్కర్‌ తండ్రి వెంకటేశ్వరరావు బోరున విలపించాడు. వినయ్‌ తల్లి సత్యవేణి, సోదరి అలేఖ్య రోదనలతో కొత్తవలస పోలీసు స్టేషన్‌లో మార్మోగింది. సాత్విక్‌ది కిర్లంపూడి మండలం భూపాలపట్నం తండ్రి చనిపోవటంతో కాకరపల్లిలో తాతగారి ఇంటి వద్ద తల్లి గంగాభవానితో కలసి ఉంటున్నాడు. ఆమె కూలి పనులు చేసుకుని సాత్విక్‌ని చదివిస్తోంది. కొడుకు మరణం జీర్ణించుకోలేక సొమ్మసిల్లిపోయింది. సాయి మిధున్‌ కాలు విరిగి వెన్నెముక దెబ్బతింది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన తండ్రి తునిలో ఓ వైన్‌ షాపులో వెండర్‌గా పని చేస్తున్నాడని బంధువులు తెలిపారు.

దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయి
అరకు నుంచి వస్తూ లారీ ప్రమాదంలో మృత్యువాత పడ్డ విద్యార్థులు గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నాం. దీనిపై రోడ్డు ప్రమాదం కేసు 304 పార్ట్‌ 2, గంజాయి రవాణాపై తహసీల్దార్‌ సమక్షంలో విచారణ చేసి ఎన్‌డీపీఎస్‌ కేసు నమోదు చేస్తాం. దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయి.– ఆర్‌.శ్రీనివాసరావు, సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement