
సాక్షి, న్యూఢిల్లీ : ‘నా మేనల్లుడికి వచ్చిన లాంటి చావు ఈ దేశంలో మరెవరికీ రాకూడదు’ అని ఉమర్ ఖాన్ మేనమామ రజాక్ ఖాన్ వ్యాఖ్యానించారు. హంతకులను అరెస్ట్ చేసే వరకు ఉమర్ ఖాన్ భౌతిక కాయానికి అటాప్సీని అనుమతించమని ఆయనతోపాటు ఇతర బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయినా గుర్తుతెలియని వ్యక్తులపైనా కేసు నమోదు చేసిన అళ్వార్ పోలీసుల్లో ఉలుకు, పలుకు లేదు. ఏడుగురు హంతకుల్లో రాకేశ్ అనే వ్యక్తిని బాధితులు గుర్తించినా, వారిని అరెస్ట్ చేయడం అటుంచి కనీసం వారిని పిలిపించి విచారించిన పాపాన పోలేదు పోలీసులు. వారి చేష్టలుడిగి చేతులెత్తేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమా?
జావెద్, తావీర్ అనే ఇద్దరు మిత్రులతో కలిసి ఓ ట్రక్కులో పశువులను తీసుకెళుతున్న ఉమర్ ఖాన్‌పై నవంబర్ 10న ఏడుగురు దుండగులు తుపాకులతో కాల్పులు జరపడం తెల్సిందే. ఈ సంఘటనలో ఉమర్ అక్కడికక్కడే మరణించగా, జావెద్ ఎలాంటి గాయాలు కాకుండా, తావీర్ బుల్లెట్ గాయాలతో హంతకుల నుంచి తప్పించుకున్నారు. మరణించిన ఉమర్‌ను పక్కనే రైల్వే ట్రాక్‌పై హంతకులు పడేసి వెళ్లారు. హంతకులు గోసంర క్షకులమని చెప్పుకున్నారని, వారిలో రాకేష్ అనే వ్యక్తిని తాము గుర్తించామని జావెద్, తావిర్‌లు చెప్పినా పోలీసుల్లో స్పందన లేదు.
ఆరు నెలల క్రితం గోరక్షకుల దాడిలో మరణించిన రైతు పెహలూఖాన్ లాగానే ఉమర్ ఖాన్‌కు చిన్న పాల డెయిరీ ఉంది. సంత నుంచి పాడి కోసం పశువులను కొనుగోలు చేసి ఘట్మికా గ్రామంలోని తన పాల డెయిరీ తరలిస్తుండగా ఈ దాడి జరిగింది. పెహలూఖాన్ హత్య కేసులో నిందితులు ఇప్పటి వరకు బెయిల్‌పై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారిపై విచారణ కూడా ప్రారంభం కాలేదు. ఈ లోగా ఉమర్ ఖాన్‌ను బలితీసుకున్నారు. ఈ కేసును కూడా మసిపూసి మారేడు కాయచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.
‘మా వద్ద మ్యాన్ పవర్ లేదు’
‘ఇలాంటి నేరాలను అరికట్టేందుకు మా వద్ద తగినంత మ్యాన్ పవర్ లేదు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదుగానీ సమస్య ఇరువైపుల ఉంది’ అని రాష్ట్ర హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా వ్యాఖ్యానించారు. అసలు గోరక్షకుల పేరిట దాడే జరగలేదంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించి తమ ప్రభువులను మెప్పించేందుకు ప్రయత్నించారు. పెహలూ ఖాన్ హత్యపై స్పందించేందుకు ఆరు నెలల సమయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె ‘హింసను సహించేది లేదు’ అంటూ రొటీన్ డైలాగ్ చెప్పి ఊరుకున్నారు.
ఎక్కడా శిక్షలు పడలేదు
ఒక్క రాజస్థాన్‌లోనే కాదు వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఇలాంటి హత్యల్లో ఇంతవరకు ఎవరికీ శిక్షపడ లేదు. కొన్ని కేసుల్లో నిందితులు అరైస్టయినా బెయిల్‌పై బయటే తిరుగుతున్నారు. ఒక్క కేసులోనైనా నేరస్థులకు శిక్ష పడుతుందన్న గ్యారంటీయే కాదు, కనీసం ఆశ కూడా లేదు. ముస్లిం అనుకొని హిందూ యువకుడినే హత్య చేసిన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేసు ముందుకు నడవడం లేదు. 2015, నవంబర్ 12వ తేదీన సాయంత్రం ఇంట్లో టీ తయారు చేయడానికి పాలు కొనుక్కొస్తానని బజారుకెళ్లిన హరీష్ పూజారి ఎప్పటికీ తిరిగి రాకుండా పోయారు. 14 కత్తిపోట్లతో శవంగా మాత్రం ఇంటికి వచ్చారు. వచ్చే మార్గంలో సమీరుల్లా అనే మిత్రుడు ఇంటివద్ద దించుతానంటే అతని టూ వీలర్ ఎక్కిన పాపానికి బజరంగ్ దళ్ యువకుల దాడికి బలయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ సమీరుల్లా బతికారు.
హిందువులే చంపారనుకోలేదు....
హిందువుల దాడిలో తన కుమారుడు మరణించాడనే విషయాన్ని పూజారి తల్లి సీతమ్మ ముందుగా నమ్మలేకపోయింది. మంచంపట్టిన ఆమె భర్తకు ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలోనే లేడు. ఓ ట్రావెల్ ఏజెన్సీలో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఆమె కూతురు మితీలక్ష్మీ ఆ సమయంలో ఊరిలో లేకపోయినా వచ్చాక మొత్తం కుటుంబం భారం మీద పడింది. ఈ కేసుల్లో 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న బజరంగ్ దళ్‌కు చెందిన మిథున్ పూజారి, భువిత్ శెట్టి, అచ్యుత్‌లను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసినా ఆ తర్వాత వారంతా విడుదలయ్యారు.
అబ్దుల్ షమీర్ పై కూడా...
కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలో నివసిస్తున్న అబ్దుల్ షమీర్ అనే యువకుడిని కూడా గోరక్షణ పేరిట దాడి జరిపారు. పశువులను తరలించే టెంపోకు డ్రైవర్‌గా పనిచేస్తున్నందుకు 2014, ఆగస్టు 23వ తేదీన గోరక్షకులు లాఠీలు, ఇనుప రాడ్లతో కొట్టి శాశ్వతంగా వికలాంగుడిని చేశారు. 13వ ఏటనే కుటుంబ పోషణ భారాన్ని మీదేసుకున్న అబ్దుల్ షమీర్ చిన్నా, చితక పనులతోపాటు ముంబైకి వెళ్లి పనిచేసి వచ్చారు. రైతులు సంతలో అమ్మిన పశువులను కబేళాలకు తరలించేందుకు, రైతులు కొనుగోలు చేసిన పశువులను వారి వారి గ్రామాలకు తరలించేందుకు అబ్దుల్ షమీర్ టెంపో నడుపుతున్నారు. (కర్ణాటకలో గోవధ నిషేధ చట్టం–64 అమల్లో ఉన్నప్పటికీ వ్యవసాయానికి పనికిరాని వాటికి కబేళాలకు విక్రయించే మినహాయింపు ఉంది) రోజుకు వెయ్యి రూపాయలు లభిస్తుండడంతో షమీర్ ఇందులో స్థిరపడ్డారు.
దాడిచేసిన వారిలో మిత్రుడు కూడా...
దాడిచేసిన గోరక్షకుల్లో ఉన్న తన ఆటోడ్రైవర్ మిత్రుడిని గుర్తించి ప్రాధేయపడినా షమీర్‌ను వదిలి పెట్టలేదట. పైగా ఆ మిత్రుడు షమీర్‌తో కలిసి అనేక సార్లు గోమాంసం కూడా తిన్నాడట. తీవ్రమైన దెబ్బలకు షమీర్ స్పహ తప్పిపోవడంతో చేనిపోయారనుకొని వదిలేసి వెళ్లారు. ఆలస్యంగా అక్కడికి చే రుకున్న రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా ఆయన్ని తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పడేసి వెళ్లారట. ఇంటికి రాలేదేమిటంటూ తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా, నర్సు ఫోన్ ఎత్తడంతో వారికీ విషయం తెల్సింది. నాలుగు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న షమీర్ వైద్యానికి నాలుగు లక్షలకుపైగా ఖర్చయింది. కూతురు పెళ్లికోసం దాచిన డబ్బుతోపాటు, ఉన్నపాటి చిన్న ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బందా షమీర్ వైద్యానికి తల్లిదండ్రులు ఖర్చుపెట్టారు. అందులో లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లును స్థానిక ఆటోడ్రైవర్ల సంఘం భరించింది.
ఆరు లక్షల విరాళం ఇచ్చిన హిందూ మహిళ
ఆ కుటుంబం మంచితనం తెల్సిన ఇరుగుపొరుగు, మిత్రులు కలిసి 12 లక్షల రూపాయల విరాళాలతో షమీర్ కుటుంబానికి ఇల్లుకూడా కట్టించారు. అందులో ఆరు లక్షల రూపాయలను పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ హిందూ మహిళనే ఇచ్చారట. పడక మీది నుంచి ఇప్పటికీ లేచి నడవలేని స్థితిలో ఉన్న షమీర్‌కు చేతులు, కాళ్లు తానై ఆయన భార్య నడిపిస్తోంది. హత్యాయత్నం, దాడి పేరిట పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన పోలీసులు షమీర్‌పై కూడా కబేళాకు గోవులను తరలిస్తున్నారని కేసు పెట్టారు. కేసులో కొంత మందిని అరెస్ట్ చేసినా వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు. ఇంకా ఈ కేసు విచారణ ప్రారంభం కావాల్సి ఉంది.
పోలీసులే హత్య చేస్తుంటే..
వివిధ రాష్ట్రాల్లోని గోరక్షణ చట్టాలు గోరక్షణ పేరిట దందాలకు ఉపయోగపడుతుండగా, పోలీసుల మామూళ్లకు కూడా ఉపయోగపడుతున్నాయి. కర్ణాటకలోని కష్టపుర గ్రామానికి చెందిన కబీర్ అనే 22 ఏళ్ల యువకుడిని ఓ పోలీసు కానిస్టేబులే కాల్చి చంపారు. పశువులను కబేళాకు తరలిస్తున్న ట్రక్కు డ్రైవరైన కబీర్‌ను పోలీసులు ఆపి మామూళ్లకోసం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్రక్కులోవున్న పలువుల యజమానులు పారిపోగా ఓ పోలీసు కాల్పులు జరిపారు. అందులో దగ్గర్లోవున్న కబీర్‌కు తూటా తగులడంతో అతను అక్కడికక్కడే మరణించారు. మావోయిస్టుల కోసం తానికోట వద్ద ఏర్పాటు చేసిన చెబ్‌పోస్ట్ వద్ద 2014, ఏప్రిల్ 19వ తేదీన ఈ సంఘటన జరిగింది. కబీర్‌ను మావోయిస్టుగా ముద్రవేసి తప్పించుకుందామని పోలీసులు తొలుత ప్రయత్నించారు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో కాల్పులు జరిపిన పోలీసుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. విచారణ ప్రారంభం కాకముందే ఈ కేసును మూసివేసేందుకు కర్ణాటక పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెల్సింది.